
అక్రమ నియామకాలను రద్దు చేయాలని డీఎంఈకి వినతి
కామారెడ్డి టౌన్ : కామారెడ్డి మెడికల్ కళాశాలలో అక్రమంగా అవుట్ సోర్కింగ్ నియామకాలను చేపట్టారని విద్యార్థి సంఘాల నాయకులు గురువారం డీఎంఈ డాక్టర్ నరేంద్రకుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మ్యాన్ పవర్ ఏజెన్సీ సంస్థ నిర్వహకులు రూ. లక్షల్లో డబ్బులు వసూళ్లు చేసి ఉద్యోగాలు ఇచ్చారని వివరించారు. రూ. కోటి వరకు కుంభకోణం జరిగిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి లావాదేవీలు విచారణ చేస్తే అవినీతి గుట్టురట్టవుతుందని తెలిపారు. అర్హులైన నిరుద్యోగులకు అన్యాయం చేశారన్నారు. కళాశాల ప్రిన్సిపల్ హస్తం సైతం అక్రమ నియామకాల్లో ఉందని ఆరోపించారు. డీఎంఈకి వివరాలతో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ, ఎస్‌ఎఫ్‌ఐ, గిరిజన విద్యార్థి సంఘాల జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు, ముదాం అరుణ్, వినోద్, బీవీఎం రాష్ట్ర కార్యదర్శి జీవిఎం. విఠల్, నాయకులు బుల్లెట్, అరవింద్, రవి, సంజయ్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.