కల్తీ కల్లుకు దూరంగా ఉండాలి
కామారెడ్డి క్రైం: కల్తీ కల్లు కు దూరంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. కల్తీ కల్లు సేవించడం ద్వారా కలిగే ఆరోగ్య సమస్యలు, దుష్ప్రభావాలపై ప్రజలను అప్రమత్తం చేయడానికి ఈ నెల 19 నుంచి గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గురువారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్‌లో ఇందుకు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 7, 8 తేదీల్లో బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల పరిధి లోని దుర్కి, దామరాంచ, అంకోల్, రాంపూర్, సంగెం, గాంధారి మండలం లోని గౌరారం గ్రామాల్లో కల్తీ కల్లు బారిన పడి ఎంతో మంది ఆస్పత్రుల పాలైన సంఘటనలను గుర్తు చేశారు. కల్తీ కల్లు కారణంగా ఆయా గ్రామాలకు చెందిన 80 మందికి పైగా అస్వస్థతకు గురై బాన్సువాడ, కామారెడ్డి, నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రుల పాలయ్యారన్నారు. ఈ వ్యవహారంలో కల్తీ కల్లు విక్రయించిన నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. కల్తీ కల్లు సేవిస్తే కలిగే అనర్ధాలు, దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సమస్యకు పరిష్కారం చూపే విధంగా ఈ వ్యసనం నుంచి బయట పడేలా ఆయా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం ఉందని గుర్తించామన్నారు. కల్తీ కల్లు ఘటనలు వెలుగు చూసిన ఆయా గ్రామాల్లో ఓ మెడికల్ ఆఫీసర్, ఎస్‌హెచ్‌వో, ఎకై ్సజ్ అధికారి, రెవెన్యూ, జీపీ అధికారులు బృందంగా 19 న పర్యటించి అవగాహన కార్యక్రమాలు చేపడతారని వెల్లడించారు.
ఈ అవగాహన కార్యక్రమాల్లో పౌర సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఆశ వర్కర్‌లు, పోలీస్ సిబ్బంది, స్వయం సహాయక సంఘాలు, గ్రామ సమాఖ్య, మండల సమైఖ్య లను భాగస్వామ్యం చేయాలన్నారు. ఆయా గ్రామాల్లోని ముఖ్యమైన ప్రదేశాల్లో అవగాహన పోస్టర్లను అతికించాలన్నారు. విద్యార్థులు మరియు స్థానిక సంఘాలతో ర్యాలీలు నిర్వహించాలని సూచించారు.
దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన
ఈ నెల 19 నుంచి గ్రామాల్లో
ప్రత్యేక కార్యక్రమాలు
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్


