కరెంట్‌పోతే గొంతెండుడే! | - | Sakshi
Sakshi News home page

కరెంట్‌పోతే గొంతెండుడే!

Apr 17 2025 1:47 AM | Updated on Apr 17 2025 1:47 AM

కరెంట

కరెంట్‌పోతే గొంతెండుడే!

ఎల్లారెడ్డి: జిల్లాలో హ్యాండ్‌ బోర్లు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. మరమ్మతలు చేయించకపోవడంతో కాలగర్భంలో కలిసిపోతున్నాయి. దీంతో విద్యుత్‌ సరఫరా లేకపోతే గుక్కెడు నీళ్ల కోసం విలవిలలాడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. జిల్లాలో గతంలో 254 హ్యాండ్‌ బోర్లు ఉండేవి. వాటిలో 80 పూడుకుపోగా 174 హ్యాండ్‌ బోర్లు పనిచేస్తున్నాయని అధికారులు కాకి లెక్కలు చెబుతున్నారు. కానీ ఎక్కడా పనిచేస్తున్న దాఖలాలు లేవు. చిన్నచిన్న మరమ్మతులతో పనిచేసే అవకాశాలున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 52.. ఎల్లారెడ్డి మున్సిపల్‌ పరిధిలో 12 హ్యాండ్‌ బోర్లు పనిచేస్తున్నట్లు మిషన్‌ భగీరథ అధికారులు చెబుతున్నారు. అయితే వాస్తవానికి వీటిలో రెండు మూడు కూడా పనిచేయడం లేదు. వెల్లుట్ల గ్రామపంచాయతీ పరిధిలో 5 హ్యాండ్‌ బోర్లు పనిచేస్తున్నాయని అధికారులు అంటున్నా గ్రామ పాఠశాలలోని చేతి పంపు తప్ప మరేదీ పనిచేయడం లేదని స్థానికులు అంటున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని 9, 10 వార్డుల్లో నీటి సామర్థ్యం ఉన్న హ్యాండ్‌బోర్లు చెడిపోయి నెలలు కావస్తున్నా అధికారులు మరమ్మతులు చేయించడం లేదు. గతేడాది ఆగస్టు 20 న ఎల్లారెడ్డిలోని సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలలో రాత్రి బస చేసిన కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ దృష్టికి చేతిపంపుల మరమ్మతుల విషయం తీసుకెళ్లగా ఆయన తక్షణం ప్రైవేట్‌ మెకానిక్‌లతో బోర్లు రిపేర్లు చేయించాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. ఏడు నెలలు గడిచినా ఇప్పటికీ మరమ్మతులు చేయించలేదు.

సింగిల్‌ ఫేజ్‌ మోటార్లను బిగించడంతో..

కొన్నిచోట్ల హ్యాండ్‌బోర్లను తొలగించి, సింగిల్‌ ఫేజ్‌ మోటార్లను బిగించారు. ఇలా చేయడంవల్ల ఎక్కువ నీరు వృథా అవుతోంది. ఒక్క బిందె నీరు అవసరమైనా స్థానికులు మోటార్‌ ఆన్‌ చేసి వదిలేస్తుండడంతో ఆ మోటార్‌ పరిధి కింద ఉండే అన్ని కుళాయిల నుంచి నీరు వృథాగా మురుగు కాలువల్లో కలుస్తోంది. దీంతో భూగర్భ జలాలు తగ్గి బోర్లు ఎత్తిపోతున్నాయి. మోటార్లు బిగించకుండా ఉండిఉంటే చేతిపంపులు చక్కగా పనిచేసేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చేతి పంపులకు రిపేర్లు చేయించి వినియోగంలోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.

హ్యాండ్‌ బోర్లకు రిపేర్లు కరువు

పట్టించుకోని బల్దియా అధికారులు

కలెక్టర్‌ ఆదేశాలూ బేఖాతరు

మరమ్మతులు చేయిస్తాం

ఎల్లారెడ్డి పట్టణంలో చెడిపోయిన బోర్ల వివరాలు సేకరిస్తున్నాం. త్వరలో ప్రైవేట్‌ మెకానిక్‌లతో వాటికి మరమ్మతులు చేయిస్తాం. హ్యాండ్‌ బోర్ల చుట్టూ 100 మీటర్ల దూరం వరకు ప్రైవేట్‌ బోర్లు వేయడం నిషిద్ధం. ఎవరైనా బోర్లు వేస్తుంటే సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటాం.

– మహేశ్‌ కుమార్‌, ఎల్లారెడ్డి మున్సిపల్‌ కమిషనర్‌

కరెంట్‌పోతే గొంతెండుడే!1
1/1

కరెంట్‌పోతే గొంతెండుడే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement