‘విద్యార్థులపై దాడి సిగ్గుచేటు’
తెయూ(డిచ్‌పల్లి): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) జాతీయ కార్యవర్గ సభ్యుడు బీ శివ తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వద్ద సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. ప్రతిష్టాత్మక హెచ్‌సీయూకి సంబంధించిన 400ల ఎకరాల భూమిని అమ్మేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. రాత్రివేళలో వర్సిటీ భూములను పొక్లెయిన్లతో చదును చేసే ప్రయత్నంపై ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలపగా, ప్రభుత్వం పోలీసుల ద్వారా వారిపై లాఠీచార్జి చేయించడం సిగ్గుచేటన్నారు. విద్యార్థులపై దాడులు చేయించడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ వర్సిటీ అధ్యక్షుడు సాయికుమార్, ఉపాధ్యక్షులు తరుణ్, సమీర్, రాము, అశోక్, శివ తదితరులు పాల్గొన్నారు.


