కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పతిలో గురువారం ఓ జంట హల్‌చల్ చేసింది. వివరాలిలా ఉన్నాయి. తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన పులి స్వప్నకు 2022లో సిజేరియన్ ఆపరేషన్ అయ్యింది. అయితే వైద్యులు సరిగ్గా కుట్లు వేయకపోవడంతో ఆమె ఇబ్బందిపడింది. పలుమార్లు అనారోగ్యానికి గురికావడంతో 2023 నవంబర్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా ఆపరేషన్ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో తన భార్యకు ఆపరేషన్ చేసిన వైద్యులెవరనే సమాచారం కోసం ఆమె భర్త ప్రభాకర్ సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేశాడు. అయితే 14 నెలలు గడుస్తున్నా ఆస్పత్రి సిబ్బంది సమాచారం ఇవ్వకపోవడంతో 20 రోజుల క్రితం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సమాచారం ఇవ్వకుండా ఆస్పత్రి సిబ్బంది ఇంకా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ గురువారం ఆ దంపతులు పురుగుల మందు డబ్బా తీసుకుని ఆస్పత్రిలోని కార్యాలయానికి వచ్చి ఆందోళన చేశారు. ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ లక్ష్మణ్‌రావు దీనిని గమనించి వారి వద్దనుంచి పురుగుల మందు డబ్బాను లాక్కొని, వారిని సముదాయించారు. దీంతో భార్యాభర్తలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
‘సమాచారం’ ఇవ్వడం లేదని ఆరోపణ
పురుగుల మందు డబ్బాతో ఆందోళన