● కేసులు, పోలీస్ స్టేషన్లు నాకు కొత్తేమీ కాదు
● మాజీ మంత్రి అంబటి రాంబాబు
కిర్లంపూడి: వైఎస్సార్ సీపీ నాయకులను, ప్రతిపక్షాలను వేధించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నైజమని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. విచారణ నిమిత్తం మంగళవారం ఆయన కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. తొలుత మాజీ మంత్రి, దివంగత నేత ముద్రగడ పద్మనాభం నివాసానికి చేరుకుని, వైఎస్సార్ సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబును, ఆయన సోదరుడు వీర రాఘవరావు(బాలు)ను కలిశారు. పద్మనాభం సతీమణి పద్మావతిని కలిసి, ఆమె ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం గిరిబాబు, పార్టీ శ్రేణులతో కలిసి ముద్రగడ సమాధి వద్ద నివాళులర్పించారు. అక్కడి నుంచి కార్యకర్తలతో కలిసి పోలీస్ స్టేషన్‌కు కాలినడకన బయలుదేరారు. జనసమూహంతో నడిచి వెళ్లేందుకు అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. తాము శాంతియుతంగానే పోలీస్ స్టేషన్‌కు వెళ్తున్నామని అంబటి చెప్పారు. అయితే, శాంతిభద్రతల సమస్య వస్తుందని పోలీసులు చెప్ప డంతో అంబటి, ముద్రగడ గిరిబాబు, పార్టీ పెద్దా పురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొర బాబు కారులోనే పోలీస్ స్టేషన్‌కు బయలుదేరారు.
గంటన్నర పాటు విచారణ
డీఎస్పీ ఏజీబీ తిలక్ ఆధ్వర్యాన అంబటి రాంబాబును సుమారు గంటన్నర పాటు పోలీస్ స్టేషన్‌లో విచారించారు. అనంతరం, అంబటి విలేకర్లతో మాట్లాడుతూ, దివంగత నేత ముద్రగడ పద్మనాభాన్ని బతికున్నంత కాలం వేధించి, కాపు జాతి కోసం ఆయన చేపట్టిన నిరాహార దీక్షలను భగ్నం చేసి, ఆయన కుటుంబంపై దాడులకు తెగబడి, ఆయనను ఏదో ఒక విధంగా జైలులో పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నించారని అన్నారు. అలాంటి నేత మరణించిన తరువాత ప్రభుత్వ లాంఛనాలు వద్దని కుటుంబ సభ్యులు సైతం చెప్పినప్పటికీ పోలీసులు దొంగచాటున వచ్చి గౌరవ వందనాలు చేస్తామనడం, తుపాకులు పేల్చుతామనడం ఏమిటని ప్రశ్నించారు. ముద్రగడ పద్మనాభం ఒక యోధుడని, కాపుల హక్కుల కోసమే కాకుండా అన్ని వర్గాల హక్కుల కోసం పోరాడిన మహా నాయకుడని చెప్పారు. ఆయన చివరి కోరిక తీర్చడం తమ బాధ్యతని స్పష్టం చేశారు. ఆయనకు ఇష్టం లేని ప్రభుత్వ లాంఛనాలు ఎందుకు చేస్తున్నారని పోలీసులను నిలదీస్తే అది పెద్ద నేరం అయిపోయిందని అన్నారు. దీంతో, తనపై కేసు పెట్టి విచారణకు పిలిచారన్నారు. తానేదో అంతర్జాతీయ నేరస్తుడినన్నట్లు సుమారు రెండు గంటల పాటు అనేక ప్రశ్నలు వేశారని చెప్పారు.
అక్రమ కేసులకు భయపడేది లేదు
ముద్రగడ అంత్యక్రియల్లో పాల్గొన్న తమపై అక్రమ కేసులు పెట్టి బెదిరించాలని చూస్తే భయపడి పారిపోతామనుకుంటున్నారా అని అంబటి ప్రశ్నించారు. కేసులు, పోలీస్ స్టేషన్లు తనకు కొత్తేమీ కాదన్నారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా చట్టబద్ధంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏ సమస్యలూ లేనట్టు వైఎస్సార్ సీపీ నాయకులపై కేసులు పెట్టడం, లోపల వేయడం కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేశ్, డీజీపీ కలిసి ఇలా చేస్తున్నారని విమర్శించారు. పోలీసులను వాళ్ల విధులను నిర్వర్తించనీయకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం తమలాంటి వారిపై ప్రయోగించి అణచివేయడానికి చూస్తున్నారనేందుకు ఇదో ఉదాహరణని చెప్పారు. న్యాయస్థానాల ఆదేశాలతో ప్రతి పోలీస్ స్టేషన్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని, లేకపోతే సాయికృష్ణను కొట్టినట్లు తమను కూడా పోలీసులతో చంద్రబాబు, లోకేశ్ కొట్టించేవారని అన్నారు. ముద్రగడ పద్మనాభం ఆశయాలను ఆయన తనయుడు గిరిబాబుతో కలిసి ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గమైన పాలన కొనసాగిస్తోందని, దీనికి పోలీసులను వినియోగించుకుంటోందని విమర్శించారు. న్యాయం తమవైపే ఉన్నప్పటికీ చంద్రబాబు వ్యవస్థలను చట్టవ్యతిరేకంగా మేనేజ్ చేస్తున్నారని అంబటి మండిపడ్డారు.
పోలీస్ స్టేషన్‌కు కాలినడకన వెళుతున్న అంబటిని అడ్డుకున్న పోలీసులు


