బాలాజీచెరువు (కాకినాడ సిటీ): రాష్ట్రంలో సెకండరీ విద్యకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అసంబద్ధంగా, అనాలోచితంగా ఉంటున్నాయని రాష్ట్ర ప్రధానోపాధ్యాయుల సంఘం నేతలు విమర్శించారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద సోమవారం నిరసన తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా సమగ్ర జాబితా తయారు చేయకపోవడం జిల్లా పరిషత్ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులు 2017లో వచ్చినప్పటికీ అధికారులు అమలు చేయకపోవడంతో కొన్ని వేల మంది ఉపాధ్యాయులు నష్టపోయారన్నారు. విద్యా శాఖలో పర్యవేక్షణ పూర్తిగా లోపించిందని విమర్శించారు. ప్రధానోపాధ్యాయులను సెక్టోరియల్ అధికారులుగా, డైట్ లెక్చరర్లుగా, స్టేట్ కౌన్సిల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అధికారులుగా నియమించాలని, కోర్టు తీర్పుల పేరుతో కాలం వెళ్లదీయకుండా తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు చెవ్వూరి రవి, కూర్మారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్, ఉపాధ్యక్షుడు కోలా సత్యనారాయణ, కోనసీమ జిల్లా అధ్యక్షులు మోకా ప్రసాద్, వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు.


