● 60 మంది పట్టే బస్సులో
180 మందిని కుక్కేస్తున్నారు
● ఫుట్ బోర్డులపై వేలాడుతూ నరకయాతన పడుతున్నాం
● ఆర్టీసీ తీరుపై విద్యార్థుల ఆగ్రహం
● కలెక్టరేట్ ఎదుట ధర్నా
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ‘ఆర్టీసీ బస్సులో ప్రయాణం.. సురక్షితం.. సుఖవంతం’ అంటూ ఏపీఎస్ ఆర్టీసీ అద్భుతమైన నినాదాలు ఇస్తుంది. కానీ, అనేక రూట్లలో అవసరమైన వేళల్లో, అవసరానికి తగినన్ని బస్సులు నడపకపోవడంతో ప్రయాణికులు ముఖ్యంగా గ్రామీణ పేద విద్యార్థులు తమ విద్యాలయాలకు చేరుకునేందుకు అత్యంత ప్రమాదకర రీతిలో ఫుట్‌బోర్డులపై వేలాడుతూ ప్రయాణించాల్సి వస్తోంది. కొత్తపల్లి మండలం ఉప్పాడ, మూలపేట, సుబ్బంపేట పరిసర గ్రామాల నుంచి నిత్యం కళాశాలలకు వెళ్తున్న విద్యార్థులు ప్రాణాలు అరచేత పట్టుకుని రాకపోకలు సాగించాల్సిన దారుణ పరిస్థితి దాపురించింది. ఈ మార్గంలో ఆర్టీసీ అధికారులు ఒకే ఒక్క బస్సు నడుపుతున్నారు. తమ ప్రయాణ అవసరాలకు దీని పైనే వందలాది మంది ఆధారపడాల్సి రావడంతో ఈ బస్సులో ప్రయాణం నిత్య నరకంగా మారింది. కేవలం 60 మంది సామర్థ్యం ఉన్న ఈ బస్సులోకి ఏకంగా 160 నుంచి 180 మందిని ఎక్కించుకుంటున్నారు. లోపలకు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో విద్యార్థులు ఫుట్‌బోర్డులపై వేలాడుతూ, కుదుపుల్లో జారి పడిపోతారేమోననే రీతిలో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో చెట్ల కొమ్మలు తగిలి గాయపడుతున్నారు. దీనికితోడు ఇటీవలి తుపాన్ల ధాటికి బీచ్ రోడ్డు తీవ్రంగా ధ్వంసమై, ఆటోల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. దీంతో, విద్యార్థులు సుబ్బంపేట, లైట్‌హౌస్ ప్రాంతాల నుంచి కిలోమీటర్ల మేర నడుస్తూ, పిఠాపురం మీదుగా మూడు నాలుగు ఆటోలు మారి కాలేజీలకు చేరుకోవాల్సి వస్తోంది. ఇది వారికి ఆర్థికంగా, ఇటు శారీరకంగా ఇబ్బందికరంగా మారింది. మరోవైపు మూలపేట మీదుగా వెళ్లే తుని, అద్దరిపేట బస్సులు సైతం విద్యార్థులను ఎక్కించుకోకుండా వెళ్లిపోతున్నాయి. ఈ సమస్యపై నెల రోజులుగా ఆర్టీసీ డిపో మేనేజర్ చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా కనీస స్పందన కూడా కరువైంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ బాధిత విద్యార్థులు కలెక్టరేట్ ఎదుట సోమవారం ఆందోళనకు దిగారు. తమ ప్రాణాలు గాల్లో కలవకముందే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కలెక్టర్ తక్షణం ఈ సమస్యను పరిష్కరించాలని విద్యార్థినులు భవాని, ఎస్తేర్ రాణి, శ్రావణి, దైవం భువనేశ్వర్ తదితరులు డిమాండ్ చేశారు. అధికారుల మొద్దునిద్ర వల్ల గ్రామీణ ఆడపిల్లల చదువులు అర్ధాంతరంగా నిలిచిపోయే దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మార్గంలో అదనపు బస్సును నడపాలని, దెబ్బ తిన్న తీరప్రాంత రహదారిని యుద్ధప్రాతిపదికన పునర్నిర్మించాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం అందజేశారు.


