వారి రాగానికి వీరి వంత | - | Sakshi
Sakshi News home page

వారి రాగానికి వీరి వంత

Nov 10 2026 12:13 AM | Updated on Nov 10 2026 12:13 AM

● కూటమి నేతలకు

అధికార గణం వత్తాసు

● వారు ఔనంటే ఔను.. కాదంటే

కాదన్న రీతిలో వ్యవహార శైలి

● కౌంటింగ్‌ హాలులో కూటమి

కాలకేయుల దౌర్జన్యం

కరప: అధికార మదంతో చెలరేగుతున్న కూటమి నేతలకు పరిషత్‌ ఎన్నికల్లో అడుగడుగునా వత్తాసు పలికిన అధికారులు.. కౌంటింగ్‌ వేళ మరింతగా స్వామి భక్తిని చాటుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 7న కాకినాడ పీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగింది. కౌంటింగ్‌ హాలులోకి అభ్యర్థితో పాటు ఒక కౌంటింగ్‌ ఏజెంటును మాత్రమే అనుమతిస్తామని అధికారులు చెప్పారు. అభ్యర్థి రాకపోతే వారికి బదులు ఇద్దరు ఏజెంట్లను అనుమతిస్తామన్నారు. ఇదంతా నిజమేననుకున్న వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు ఆవిధఃగా దరఖాస్తు చేసుకుని, ఆ మేరకు కౌంటింగ్‌ ఏజెంట్‌ పాస్‌లు తీసుకున్నారు. అయితే, కూటమి అభ్యర్థుల విషయంలో మాత్రం అధికారులు మరోలా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. కూటమికి చెందిన అభ్యర్థులతో పాటు ఒక్కొక్కరి తరఫున మరో ఇద్దరికి కౌంటింగ్‌ ఏజెంటు పాస్‌లు మంజూరు చేశారు. అలాగే, ఓట్ల లెక్కింపు సమయంలో కూడా కూటమి నాయకులు చెల్లదు అంటే చెల్లదు, చెల్లుతుంది అంటే చెల్లుతుందనే రీతిలో వారికి కౌంటింగ్‌ అధికారులు వత్తాసు పలికారు. కరప మండలంలో 22 ఎంపీటీసీ స్థానాలుండగా 9 టీడీపీ, 11 జనసేన, ఒకరు ఇండిపెండెంట్‌గా గెలిచారు. వేళంగి–2 స్థానంలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి సానా అరుణ గెలుపొందారు. అయితే, ఆమె విజయం విషయంలో కూడా కూటమి నాయకుల కుట్రలకు విఫలయత్నం చేశారు. వేళంగి–2 స్థానంలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి అరుణతో పాటు ఒక్కరికి మాత్రమే అధికారులు కౌంటింగ్‌ ఏజెంటు పాసులు ఇచ్చారు. కానీ, టీడీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థితో పాటు, మరో ఇద్దరికి పాస్‌లు ఇచ్చారని అరుణ చెప్పారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే 7 ఓట్ల ఆధిక్యతతో అరుణ గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. అయితే, ప్రత్యర్థి కోరిక మేరకు రీ కౌంటింగ్‌ చేసిన తర్వాత కూడా 7 ఓట్ల మెజార్టీయే వచ్చింది. దీనికి ప్రత్యర్థి కూడా అంగీకరించారు. కానీ, అదే సమయంలో వేళంగి సెగ్మెంటుతో సంబంధం లేని కూటమి నాయకులు పలువురు కౌంటింగ్‌ హాలులోకి దౌర్జన్యంగా ప్రవేశించి, అధికారులపై విరుచుకుపడ్డారు. నిబంధనల ప్రకారం రెండుసార్లకు మించి రీ కౌంటింగ్‌ చేయకూడదు. ఆ విషయాన్ని అధికారులు చెప్పినప్పటికీ కూటమి నాయకులు అరుపులు, కేకలు వేయడంతో మళ్లీ రీకౌంటింగ్‌ చేశారు. ఆ సమయంలో రెండు ఓట్లు చెల్లవంటూ బలవంతంగా తీయించేశారు. అయినప్పటికీ 5 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి అరుణ విజయం సాధించారు. ఈ ఫలితాన్ని తారుమారు చేయడానికి గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తూండగా అదే సమయంలో ఓ మహిళా పోలీసు అధికారి అక్కడకు వచ్చి, కౌంటింగ్‌ ఏజెంట్లు కాకుండా అంతమంది లోపలకు ఎలా వచ్చారని, అక్కడ గొడవ చేయడమేమిటని ప్రశ్నించారు. చివరకు ఓటమి తప్పదని తేలడంతో కూటమి నాయకులు అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. ఇంత వాగ్వాదం జరుగుతున్నా మండల అధికారులెవ్వరూ మాట్లాడలేదని, ఆ పోలీసు అధికారి రాకపోయి ఉంటే ఫలితాన్ని తారుమారు చేసి ఉండేవారని అరుణ అన్నారు.

ధ్రువీకరణ పత్రం అందుకుంటున్న అరుణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement