రిజర్వ్‌ ఫారెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

రిజర్వ్‌ ఫారెస్ట్‌

Nov 10 2026 12:13 AM | Updated on Nov 10 2026 12:13 AM

ఆక్రమణకు ప్రయత్నాలు

● వారం రోజుల్లో పదెకరాల్లో

తుప్పల తొలగింపు!

● 15 మందిపై పోలీసులకు

అటవీ అధికారుల ఫిర్యాదు

జగ్గంపేట: భావవరం వద్ద రిజర్వ్‌ ఫారెస్టును ఆక్రమించే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వారం రోజులుగా వంద మంది కూలీలు ఇప్పటికే అక్కడ పదెకరాల్లో తుప్పలు తొలగించినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసినప్పటికీ అటవీ శాఖ ఉన్నతాఽధికారులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారని, తమ తప్పు లేదని చెప్పుకోవడానికి పోలీసులకు మొక్కుబడిగా ఫిర్యాదు చేశారనే విమర్శలు వస్తున్నాయి. కొండపోడు భూమి వచ్చేలా చేస్తామంటూ భావవరం, పరిసర గ్రామాలకు చెందిన కూలీలను కొంత మంది ప్రలోభపెట్టి రిజర్వ్‌ ఫారెస్ట్‌పై పెత్తనం చేస్తున్నట్లు సమాచారం. కొన్ని సంవత్సరాలు క్రితం ఇదే విధంగా కొండపోడు ఆశ చూపించి కొంత మంది వ్యక్తులు విలువైన వృక్ష సంపదను నరికేసి దోచుకున్నట్లు ఆరోపణలున్నాయి. నేడు మళ్లీ అదే రీతిలో చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో రిజర్వ్‌ ఫారెస్ట్‌లో కొండపోడు కోసం కొంత మంది దరఖాస్తు చేసుకోగా అటవీ శాఖ తిరస్కరించినట్లు తెలుస్తోంది. నేడు మళ్లీ కొండపోడు ఆశ చూపించి కూలీలను బలి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భావవరం రిజర్వ్‌ ఫారెస్ట్‌లో ఆక్రమణలపై ఫారెస్టర్‌ పి.రవిశంకర్‌నాగ్‌ పర్యవేక్షణలో మల్లవరం నార్త్‌ బీట్‌ ఆఫీసర్‌ వై.ఝాన్సీరాణి జగ్గంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఆమె ధ్రువీకరించారు. మొత్తం 15 మంది కూలీలు రిజర్వ్‌ ఫారెస్టులోకి ప్రవేశించి, నిబంధనలకు విరుద్ధంగా తుప్పలు నరుకుతున్నారని తెలిపారు. ఎవరో వారిని తప్పుదోవ పట్టిస్తున్నారని, రిజర్వ్‌ ఫారెస్ట్‌లో ఇలా తుప్పలు నరకడం వల్ల కూలీలు కేసుల్లో ఇరుక్కుంటారని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement