కర్సయిపోతున్నాం | - | Sakshi
Sakshi News home page

కర్సయిపోతున్నాం

Nov 10 2026 12:13 AM | Updated on Nov 10 2026 12:13 AM

సాక్షి ప్రతినిధి, కాకినాడ: పరిషత్‌ ఎన్నికల ఘట్టం ముగిసింది. పోలింగ్‌, కౌంటింగ్‌, గెలుపొందిన అభ్యర్థుల ప్రకటన ప్రక్రియలూ పూర్తయ్యాయి. కానీ, ఈ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ నుంచి ఇప్పటి వరకూ నయాపైసా కూడా విడుదల కాలేదు. దీంతో, తమకు చేతిచమురు వదిలిపోయిందని పంచాయతీ కార్యదర్శులు గగ్గోలు పెడుతున్నారు. సాధారణంగా ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ముందుగానే నిధులు విడుదల చేయడం ఆనవాయితీ. ఆ నిధులతో పంచాయతీ కార్యదర్శులు ఎన్నికల ఏర్పాట్లు చేసేవారు. కానీ, కూటమి సర్కారు ఆ ఆనవాయితీకి తిలోదకాలిచ్చింది. ఆర్భాటంగా ఎన్నికలు పెట్టిన చంద్రబాబు సర్కారు.. వాటి నిర్వహణకు మాత్రం నిధులు విడుదల చేయకుండా నిర్లక్ష్యం చూపుతోంది. దీంతో, ఎన్నికల ఖర్చులకు కొన్నిచోట్ల అప్పులు చేయాల్సి వచ్చిందని, మరి కొన్నిచోట్ల సొంత డబ్బులు ఖర్చయిపోయాయని కార్యదర్శులు వాపోతున్నారు.

నిధుల విడుదలపై స్పష్టతేదీ?

జిల్లాలో 20 జెడ్పీటీసీ, 395 ఎంపీటీసీ స్థానాలకు ఇటీవల ఎన్నికలు నిర్వహించారు. మండల స్థాయి ఎన్నికలు కావడంతో వీటి నిర్వహణ బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించారు. గతానికి భిన్నంగా ఈసారి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ముందుగా నిధులు విడుదల చేయలేదు. ఎన్నికల నిర్వహణ తప్పనిసరి కావడంతో ఆయా పంచాయతీల కార్యదర్శులు చేసేది లేక సొంత నిధులు వెచ్చించారు. ఎన్నికలయ్యాకై నా నిధులు విడుదలవుతాయని ఆశించినా ఇంత వరకూ అతీగతి లేదు. ప్రభుత్వం ఎప్పుడు నిధులు విడుదల చేస్తుందో, చేసిన అప్పులు ఎప్పుడు తీర్చాలోనని వారు ఆందోళన చెందుతున్నారు.

పరిషత్‌ అధికారులదీ అదే తంతు

ఎన్నికల విధుల నిర్వహణకు మండల పరిషత్‌, ఇతర అధికారులకు సైతం అవసరమైన మేరకు ప్రభుత్వం నిధులు విడుదల చేసిన దాఖలాల్లేవు. ప్రతి కార్యాలయంలో సుమారు 20 నుంచి 50 మంది వరకూ సిబ్బంది ఎన్నికల విధుల్లో పని చేశారు. పోలీసు సిబ్బందితో కలిపితే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. వీరందరికీ తాగునీరు, టీ, కాఫీ, టిఫిన్లు, భోజనాలు సమకూర్చడం తప్పనిసరిగా మారింది. ఉదయం ప్రారంభమైన ఎన్నికల పనులు రాత్రి వరకూ కొనసాగడంతో సిబ్బంది కనీస సౌకర్యాలకు నిధులు వెచ్చించాల్సి వచ్చింది. నామినేషన్లకు సంబంధించిన పత్రాల జిరాక్స్‌ ప్రతులు, దరఖాస్తుల ముద్రణ, రికార్డుల నిర్వహణ, ఫైళ్లు, కాగితాలు, ఇతర స్టేషనరీ సామగ్రి కొనుగోలుకు మండల పరిషత్‌ అధికారులు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వచ్చింది. ప్రింటింగ్‌, స్టేషనరీ ఖర్చులకే వేల రూపాయలు వెచ్చించాల్సి వచ్చిందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

సర్పంచ్‌ ఎన్నికల భయం

ఇప్పటికే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఖర్చులకు చేసిన అప్పులు గుబులు పుట్టిస్తూంటే.. పులి మీద పుట్రలా తాజాగా ఈ నెల 13వ తేదీ నుంచి సర్పంచ్‌ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ఎన్నికల నిర్వహణకు సైతం ప్రభుత్వం ఇప్పటి వరకూ నయాపైసా కూడా విడుదల చేయలేదు. ఎప్పుడు విడుదల చేస్తుందో కూడా తెలియని పరిస్థితి. జిల్లావ్యాప్తంగా 385 పంచాయతీలున్నాయి. ఒక్కో పంచాయతీలో సర్పంచ్‌ ఎన్నికల నిర్వహణకు కనీసం రూ.లక్ష వరకూ ఖర్చు అవుతుందన్నది అంచనా. మేజర్‌ పంచాయతీలకై తే రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకూ వెచ్చించాలి. ఈ లెక్కన జిల్లాకు రూ.6 కోట్లకు పైగా అవసరం. కానీ, ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఈ ఎన్నికలు ఏవిధంగా నిర్వహించగలమని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోతే ఈ ఎన్నికలు ఏవిధంగా నిర్వహించాలోనని ఆందోళన చెందుతున్నారు. ఈ ఎన్నికలకు కూడా తిరిగి సొంత డబ్బులే ఖర్చు చేయాలేమోనని పంచాయతీ కార్యదర్శులు, మండల అధికారులు ఆందోళన చెందుతున్నారు.

ఎన్నికల ఖర్చు తడిసిమోపెడు

పంచాయతీ కార్యదర్శులు,

అధికారులకు వదిలిపోయిన చేతిచమురు

‘పరిషత్‌’ ఎన్నికలకు

సుమారు రూ.5.77 కోట్ల వ్యయం

నయాపైసా ఇవ్వని సర్కారు

అప్పులు చేసి నిర్వహించిన అధికారులు

పులి మీద పుట్రలా 13 నుంచి

సర్పంచ్‌ ఎన్నికల ప్రక్రియ

ఖర్చులపై కార్యదర్శుల ఆందోళన

జిల్లాలో రూ.5.77 కోట్ల ఖర్చు

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ బూత్‌ల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యతను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, పోలింగ్‌ ఏర్పాట్లు, ఓట్ల లెక్కింపు తదితర దశల్లో నిరంతరం ఖర్చులుంటాయి. ప్రతి దశలోనూ సిబ్బంది టిఫిన్లు, భోజనం కాఫీ, టీ వంటి వాటితో పాటు టెంట్లు, కుర్చీలు అవసరం. ప్రతి పోలింగ్‌ బూత్‌లో సుమారు 10 నుంచి 15 మంది సిబ్బంది విధులు నిర్వర్తించారు. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ముగిసే వరకూ వారికి కూడా పై ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత కార్యదర్శులపై పడింది. ఇలా ఒక్కో పంచాయతీకి సగటున రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకూ వెచ్చించారు. చిన్న పంచాయతీలో సైతం కనీసం రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకూ ఖర్చయ్యింది. ఇలా ఒక్కో కార్యదర్శికి రూ.వేలల్లో వదిలిపోయినట్లు చెబుతున్నారు. ఈవిధంగా జిల్లావ్యాప్తంగా సుమారు రూ.5.77 కోట్ల మేర ఖర్చయినట్లు సమాచారం. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు విడుదల చేయకపోవడంతో పంచాయతీ కార్యదర్శులు కొన్నిచోట్ల భోజనాల హోటళ్ల వద్ద అరువు పెట్టాల్సి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement