అన్నవరం: కార్తిక పౌర్ణమి సందర్భంగా ఈ నెల 24న జరిగే సత్యదేవుని గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా చేయాలని కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ దేవస్థానం అధికారులను ఆదేశించారు. గిరి ప్రదక్షిణ మార్గాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. పోలవరం కాలువ నిర్మాణంలో భాగంగా జాతీయ రహదారిపై ఫ్లై ఓవర్ల నిర్మాణం వలన గిరి ప్రదక్షిణ జరిగే పుష్కర రోడ్డుకు అనుసంధా నం చేసే సర్వీసు రోడ్డును తక్కువ వెడల్పుతో మ ట్టితో నిర్మించడం.. సత్యరథం వెళ్లడానికి అది ఇ బ్బందికరంగా ఉండటంపై ‘దారి చూపు స్వామీ’ శీర్షికన ‘సాక్షి‘ ఈ నెల 6న కథనం ప్రచురించింది. దీనిపై దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ స్పందించి గిరి ప్రదక్షిణకు తగు ఏర్పా ట్లు చేయాలని ఆదేశాలిచ్చారు. ఈ మేరకు ఈ రోడ్డు సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఆలయ ఈఓ ఎన్.సూర్యచక్రధరరావు రాసిన లేఖకు కలెక్టర్ స్పందించి, ఈ రోడ్డును పరిశీలించారు. అంతకు ముందే సత్యరథం ట్రయల్ రన్ చాలా కష్టమైన విషయాన్ని దేవస్థానం అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అయితే, ఇప్పటికిప్పుడు ఈ సర్వీసు రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులు చేపట్టడం సాధ్యం కాదని ఆర్‌అండ్‌బీ అధికారులు చెప్పారు. అయితే, ఇరుకుగా ఉన్న 300 మీటర్ల మేరకు చదును చేసే పనులు వెంటనే చేపట్టాలని కలెక్టర్ మాట్లాడుతూ, ఆదేశించారు. గిరి ప్రదక్షిణ రోడ్డు చివరి వరకూ వెళ్లి, ఆ మార్గంలో ఉన్న చిన్నచిన్న గులకరాళ్లను తొలగించాలని, గడ్డి వేయాలని దేవస్థానం అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఈ రామకృష్ణ, పలు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.
జెడ్పీ సీఈవోపై
చర్యలు తీసుకోవాలి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా పరిషత్ ఎన్నికలకు రెవెన్యూ అధికారులను బాధ్యుల్ని చేయవద్దని డీఆర్‌ఓ తిప్పేనాయక్, జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ప్రతినిధి చంద్రశేఖర్‌రెడ్డి కోరారు. ఈ మేరకు కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌కు కలెక్టరేట్‌లో సోమవారం వినతిపత్రం అందజేశా రు. అసోసియేషన్ ప్రతినిధులు చంద్రశేఖర్‌రెడ్డి, సాధనాల రామ్మోహన్ మాట్లాడుతూ, కాకినాడ పీఆర్ కళాశాల ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద జెడ్పీ సీఈవో లక్ష్మణరావు, కాకినాడ ఆర్‌డీవో మ ల్లిబాబు మధ్య వాగ్వాదం జరిగిందన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మంచినీరు, టిఫిన్లు, కుర్చీల ఏర్పాటుపై ఆర్‌డీవో మల్లిబాబు అడిగిన ప్రశ్నకు జెడ్పీ సీఈఓ దురుసుగా బదులివ్వడంతో వివా దం జరిగిందని అన్నారు. ఎన్నికల నిర్వహణ బా ధ్యత పూర్తిగా జెడ్పీ సీఈవోదేనని అన్నారు. ఎన్నికల నిర్వహణ అనుభవం ఉన్న రెవెన్యూ అధికారులను మార్గదర్శకం కోసం నియమించారని, అంతమాత్రాన తమను బాధ్యుల్ని చేయవద్దని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల విధుల్లో దురుసుగా ప్రవర్తించిన జెడ్పీ సీఈవోపై చర్యలు తీసుకోవాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్, పెద్దాపురం ఆర్‌డీవో కృష్ణమూర్తి, పలువురు తహసీల్దార్లు ఉన్నారు.
టీచర్ ఎమ్మెల్సీ ఓటుకు
14 వేల దరఖాస్తులు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): శాసన మండలి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకూ 14 వేల ఓటరు దరఖాస్తులు వచ్చా యని డీఆర్‌వో తిప్పేనాయక్ తె లిపారు. కలెక్టరేట్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాకినాడ జిల్లాలో 3,349, కోనసీమలో 1,499, తూ ర్పు గోదావరిలో 2,747, పశ్చిమ గోదావరిలో 2,986, ఏలూరులో 2,370, పోలవరం జిల్లాలో 1,061 చొప్పున దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తయ్యిందన్నారు. ఇంకా దాదాపు 2 వేల దరఖాస్తుల పరిశీలన, డేటా ఎంట్రీ పూర్తి కావాల్సి ఉందని చెప్పారు. వీటితో దరఖాస్తుల సంఖ్య 16 వేలు దాటే అవకాశముందని వెల్లడించారు.


