● పంచారామ క్షేత్రంలో
అసంపూర్తిగా ఫ్లోరింగ్
● అర్ధాంతరంగా వదిలేసిన పురావస్తు శాఖ
● కార్తికంలో భక్తులకు తప్పని ఇక్కట్లు
సామర్లకోట: కార్తిక మాసం మంగళవారం ప్రారంభమవుతూండటంతో సుప్రసిద్ధ పంచారామ క్షేత్రమైన సామర్లకోట బాలాత్రిపుర సుందరీ సమేత కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయంలో భక్తుల సందడి మొదలు కానుంది. వేలాదిగా భక్తులు ఆలయానికి తరలి రానున్నారు. ఇటువంటి సమయంలో వారికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు ఆలయంలో సిద్ధంగా ఉండాలి. కానీ, పురావస్తు శాఖ అధికారులు చేసిన సగంసగం పనులతో ఈసారి భక్తులకు ఇక్కట్లు తప్పని పరిస్థితి నెలకొంది. మూడేళ్ల క్రితం వంగా గీత ఎంపీగా ఉన్న సమయంలో ఈ క్షేత్రంలో ఫ్లోరింగ్ పనులకు కేంద్ర పురావస్తు శాఖ నుంచి నిధులు రప్పించారు. కానీ, అప్పటి నుంచీ ఈ పనులపై పురావస్తు శాఖ జాప్యం చేస్తూ వస్తోంది. ఎట్టకేలకు సెప్టెంబర్ ఏడో తేదీన ఈ పనులు ప్రారంభించింది. వాస్తవానికి అవసరమైన మెటీరియల్ సిద్ధం చేసుకున్న తరువాత మాత్రమే ఈ పనులు ప్రారంభించాల్సి ఉండగా పురావస్తు అధికారులు దీనికి విరుద్ధంగా వ్యవహరించారు. ముందుగా ఫ్లోరింగ్ రాళ్లు తొలగించేశారు. తరువాత అటువంటి రాళ్ల కోసం క్వారీలు చుట్టూ తిరుగుతున్నారు. ఆ రాళ్లు లభించడం లేదని చెబుతూ ఆలయ ఆవరణలో ఫ్లోరింగ్ పనులను అర్ధాంతరంగా వదిలేశారు. దీంతో, ఆలయ ఆవరణలో ప్రదక్షిణలు చేస్తున్న క్రమంలో పైకి లేచిపోయిన రాళ్లు తగిలి భక్తుల కాలి వేళ్లకు తరచూ గాయాలు అవుతున్నాయి. శరన్నవరాత్ర ఉత్సవాల్లో భక్తులు ఇదేవిధంగా తీవ్ర ఇబ్బంది పడ్డారు. అలాగే, ఆలయంలో దర్శనం టిక్కెట్లు తీసుకున్న భక్తులు కొబ్బరి కాయ కొట్డడానికి వెళ్లే సమయంలో కూడా ఫ్లోరింగ్‌లో పైకి లేచిపోయిన రాళ్లు కాలి వేళ్లకు తగిలి గాయపడుతున్నారు. పురావస్తు అధికారుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు. కనీసం మహాశివరాత్రి నాటికై నా ఈ పనులు పూర్తి చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఫ్లోరింగ్ పనులు పూర్తి చేయడానికి సమయం పడుతుందని పురావస్తు శాఖ సీఐ కేవీవీఎస్‌ఎన్ మూర్తి చెప్పారు.


