● కాకినాడ కార్పొరేషన్
ఎన్నికల వేళ వసూళ్ల పర్వం
● సీటుకు రూ.15 లక్షల నుంచి
రూ.20 లక్షల వరకు డిమాండ్
● ఇప్పటికే కప్పం కట్టిన
పలువురు అభ్యర్థులు
● ఓ ప్రజాప్రతినిధి అక్రమాల బాగోతం!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. సర్పంచ్ ఎన్నికలతో పాటు ఈ ఎన్నికలు కూడా నిర్వహించాలని కూటమి సర్కారు భావిస్తోంది. ఇప్పటికే వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయ్యాయి. ఇక ఎన్నికల కసరత్తే తరువాయి. దీంతో, కార్పొరేటర్లుగా పోటీ చేసేందుకు ఆశావహులు ముందుకొస్తున్నారు. ఇదే అదునుగా ఓ ప్రజాప్రతినిధి కార్పొరేటర్ సీట్లను అంగట్లో సరుకులా మార్చేసి, వసూళ్ల పర్వానికి తెర తీశారనే ఆరోపణలు నగరంలో వెల్లువెత్తుతున్నాయి. కార్పొరేషన్‌లో ఏదైనా వార్డు నుంచి కార్పొరేటర్‌గా బరిలోకి దిగాలంటే ప్రజాదరణ కంటే ముందుగా అక్కడి పరిస్థితులను బట్టి తనకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు తనకు కప్పం కట్టాలంటూ ఆయన హుకుం జారీ చేసినట్లు చెప్పుకొంటున్నారు. అడిగినంతా సమర్పించని పక్షంలో కార్పొరేటర్ సీటు కష్టమని బెదిరిస్తూ మరీ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ బాగోతం కాకినాడ నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. రాజకీయంగా రాణించాలనుకున్న వారు చేసేది లేక సదరు ప్రజాప్రతినిధి అడిగినంతా సమర్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. కాకినాడ కార్పొరేషన్‌లో 66 డివిజన్లు ఉండగా.. ఇప్పటికే నాలుగు డివిజన్లలో కార్పొరేటర్ అభ్యర్థులు ఆ ప్రజాప్రతినిధికి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు సమర్పించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఎక్కువగా ‘సమర్పించిన’ వారికే..
సాధారణంగా ఏ పార్టీలో అయినా పార్టీ కోసం కష్టపడిన వారికి సీట్లు కేటాయించడం పరిపాటి. కానీ అధికార కూటమిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఎవరు ఎక్కువగా సమర్పించుకుంటే వాళ్లకే సీటు గ్యారంటీ అని చెబుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామం ఎన్నికల బరిలో దిగాలనుకుంటున్న వారికి ఆందోళన కలిగిస్తోంది. అభ్యర్థులకు పార్టీ నుంచి ఎలాంటి నిధులూ వచ్చే పరిస్థితి లేకపోగా.. సదరు ప్రజాప్రతినిధికి కప్పం కట్టుకుని.. ఎన్నికల్లో తిరిగి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలంటే ఎలాగంటూ వారు నిట్టూరుస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రజాప్రతినిధులు ఆర్థికంగా ఆదుకోవాల్సింది పోయి.. తమ వద్దే వసూళ్లకు పాల్పడటమేమిటంటూ మండిపడుతున్నారు.
సీట్ల సర్దుబాటు కాకముందే..?
కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా కాకినాడ మేయర్ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. టీడీపీ, జనసేన, బీజేపీలోల ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే లెక్కలపై, ఆయా పార్టీలు ఏ డివిజన్లు ఆశిస్తున్నాయో ఇంకా స్పష్టత లేదు. అయినప్పటికీ సదరు ప్రజాప్రతినిధి కార్పొరేటర్ సీటు ఇప్పిస్తామంటూ హామీలు గుప్పిస్తూ వసూళ్లకు పాల్పడుతూండటం ఆయా పార్టీల శ్రేణులను విస్మయానికి గురి చేస్తోంది. సీట్ల సర్దుబాటులో భాగంగా తాము ఆశించిన డివిజన్ దక్కకపోతే తాము కట్టిన కప్పం తిరిగి ఇస్తారా, తమ డబ్బులు వెనక్కు ఇవ్వాలంటూ డిమాండ్ చేయగలమా అని ఇప్పటికే డబ్బులు కట్టిన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది.


