● ముంచెత్తిన ఉప్పునీరు
● 250 ఎకరాల్లో పూర్తిగా నాశనమైన వరి
● అప్పులు తీర్చే దారి లేక
చావే గతి అంటూ రైతుల ఆవేదన
● పట్టించుకోని ప్రజాప్రతినిధులు
● పూర్తి పరిహారం ఇవ్వాలని
అన్నదాతల విన్నపాలు
కొత్తపల్లి: కోటి ఆశలతో ఖరీఫ్ సాగుకు ఆనందంగా శ్రీకారం చుట్టారు. అప్పులు తెచ్చి మరీ పెట్టుబడి పెట్టారు. నారు దశ నుంచే పంటను చంటిబిడ్డలా కాపాడుకున్నారు. అంతలోనే ప్రకృతి కన్నెర్ర చేసింది. తల్లి రెక్కల మాటున నేల మీద హాయిగా పెరుగుతున్న కోడిపిల్లను.. ఆకాశం నుంచి రివ్వున దూసుకొచ్చి ఎత్తుకుపోయిన గద్ద మాదిరిగా.. పసిడి కంకులు వేసిన పంటను.. అర్నబ్ తుపాను సమూలంగా కబళించేసింది. ఎన్నడూ లేనివిధంగా విరుచుకుపడిన ఈ విపత్తును చూసి అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. కొత్తపల్లి మండలం ఉప్పాడ శివారు సుబ్బంపేట వద్ద నుంచి కొత్తపల్లి ఎస్సీ పేట పరిసర ప్రాంతాల వరకూ సుమారు 60 మంది రైతులు దాదాపు 250 ఎకరాల్లో ఈ ఏడాది ఖరీఫ్‌లో వరి సాగు చేశారు. సాగు పెట్టుబడి కోసం రూ.లక్షల్లో అప్పులు చేసి మరీ పెట్టుబడి పెట్టారు. కాలం కలిసి రావడంతో పంట ఏపుగా ఎదిగింది. కంకులు వేసింది. పసిడి వర్ణాన్ని అద్దుకుంటూ చేతికి అందివచ్చే దశకు చేరుకుంది. అంతలోనే గత నెల 27న విరుచుకుపడిన అర్నబ్ తుపాను ఆ అన్నదాతల పాలిట పిడుగుపాటే అయ్యింది. తుపాను ప్రభావంతో వీచిన భీకర గాలుల తాకిడికి గతంలో ఎన్నడూ లేనివిధంగా సముద్రం ఎగసి పడింది. ఉప్పాడ – కాకినాడ బీచ్‌రోడ్డు తీవ్రంగా కోతకు గురైంది. ఉప్పెనలా ఎగసిపడిన సముద్రపు ఉప్పునీరు ఆ రోడ్డును దాటుకుని మరీ పచ్చని పంటలను సుమారు రెండున్నర కిలోమీటర్ల మేర పూర్తిగా ముంచెత్తింది. తుపాను వచ్చి వారం రోజులు గడిచినా పొలాల్లో చేరిన ఉప్పు నీరు దిగకపోవడంతో వరి పంట పూర్తిగా దెబ్బ తింది. ఎండిపోయినట్టుగా అయిపోయి, ఎందుకూ పనికిరాకుండా పోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. పంట చేతికొస్తుందని ఆశపడ్డామని, ఇంతలోనే ప్రకృతి ప్రకోపానికి తమ జీవితాలు తలకిందులయ్యాయని కన్నీటిపర్యంతమవుతున్నారు. ఇంతగా నష్టపోయినప్పటికీ తమను ఏ ఒక్కన ప్రజాప్రతినిధీ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


