రూ.లక్షల్లో అప్పులు చేసి సాగు చేసిన పంట పూర్తిగా నష్టపోయాం. చేసిన అప్పులు తిరిగి ఎలా చెల్లించాలో తెలియక ఆందోళనగా ఉంది. పంట నష్టంపై తహసీల్దార్, మండల వ్యవసాయ అధికారి, పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ప్రాజెక్టు డైరెక్టర్ తదితరులకు ఇప్పటికే ఫిర్యాదులు చేశాం. ఇప్పటి వరకూ మాకు న్యాయం జరగలేదు. అధికారులు, నాయకులు క్షేత్ర స్థాయిలో పర్యటించి మా కష్టాలను గుర్తించాలి.
– గణేశుల వెంకట రమణ, రైతు, కొత్తపల్లి
పాతికేళ్లలో ఎన్నడూ చూడనంత నష్టం
నేను పాతికేళ్లుగా వ్యవసాయం చేస్తున్నాను. ఎన్నో తుపాన్లను చూశాను. గతంలో తుపాన్ల సమయంలో పంటలు నేలకొరిగి, నీట మునిగేవి. కానీ, సముద్రపు ఉప్పు నీరు పొలాల్లోకి చేరి, పంటను నాశనం చేయడం ఇదే తొలిసారి. నేను సుమారు 20 ఎకరాల్లో వేసిన వరి పంట పూర్తిగా పనికి రాకుండా పోయింది. ప్రభుత్వం స్పందించి, పంట నష్టపోయిన రైతులకు పూర్తి స్థాయిలో పరిహారం అందించి, ఆదుకోవాలి.
– గౌతు గోవిందు, రైతు, వాకతిప్ప
అప్పులు తీర్చలేకపోతున్నాం.. ఆదుకోండి
ఉన్న బంగారం తాకట్టు పెట్టి, అప్పులు తెచ్చి, కౌలుకు తీసుకున్న భూమిలో సాగు చేసేందుకు పెట్టాను. మొత్తం ఆరెకరాల్లో వరి పంట ఉప్పు నీటి కారణంగా పూర్తిగా నాశనమైంది. పంటపై పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు. మాలాంటి కౌలు రైతులను కూడా ప్రభుత్వం గుర్తించి, ఎకరానికి రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వాలి.
– చంద్రశేఖర్, రైతు, కొత్తపల్లి
ఉన్నతాధికారుల
దృష్టికి తీసుకెళ్లాం
ఉప్పు నీటి కారణంగా పంట నష్టపోయిన రైతుల వివరాలను జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. నష్టం వివరాలను డ్రోన్ కెమెరాతో చిత్రీకరించి ఉన్నతాధికారులకు పంపించాం. రైతులు ఆందోళన చెందవద్దు.
– జోగిరాజు, మండల వ్యవసాయ
అధికారి, యు.కొత్తపల్లి


