పకడ్బందీగా జనాభా లెక్కల సేకరణ | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా జనాభా లెక్కల సేకరణ

Nov 11 2026 12:13 AM | Updated on Nov 11 2026 12:13 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): అత్యంత కీలకమైనజనాభా లెక్కల సేకరణ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని, ప్రతి సమాచారం కచ్చితత్వంతో ఉండేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిర ప్రసాద్‌ అన్నారు. జనాభా లెక్కలు–2027 రెండో దశ, జనాభా నమోదు కార్యక్రమంపై జిల్లా స్థాయి అధికారులకు కలెక్టరేట్‌లో మంగళవారం చేపట్టిన రెండు రోజుల శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎక్కడైనా కుటుంబ సభ్యులు అందుబాటులో లేకపోతే రెండు మూడుసార్లు సందర్శించి, కచ్చితంగా వివరాలు నమోదు చేయాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. హైదరాబాద్‌కు చెందిన డైరెక్టర్‌ ఆఫ్‌ సెన్సస్‌ జాయింట్‌ డైరెక్టర్‌ జీవీ చంద్రకళ మాట్లాడుతూ, జనాభా లెక్కల ప్రాధాన్యాన్ని వివరించారు. కార్యక్రమంలో డీఆర్వో తిప్పేనాయక్‌ కూడా పాల్గొన్నారు.

ఎన్నికల విధుల నుంచి

వారిని మినహాయించాలి

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న ఉపాధ్యాయులకు గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ సూరిబాబు కోరారు. ఈ మేరకు కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌కు మంగళవారం కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. బాలింతలు, మంచం బారిన పడిన పిల్లల సంరక్షణ చూసుకుంటున్న తల్లిదండ్రులకు, 60 సంవత్సరాలు దాటి రిటైర్మెంట్‌కు దగ్గరలో ఉన్న ఉపాధ్యాయులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మహిళా ఉపాధ్యాయులకు అదే మండలం లేదా పక్క మండలాల్లో ఎన్నికల విధులు కేటాయించాలన్నారు. ఎన్నికల విధుల అనంతరం ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సూరిబాబు చెప్పారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీవీ నగేష్‌, అసోసియేట్‌ అధ్యక్షుడు ఎన్‌.గోవిందరాజులు, రాష్ట్ర కార్యదర్శి టి.రవి చక్రవర్తి, రాష్ట్ర మాజీ కార్యదర్శి ఎ.ప్రభాకరవర్మ తదితరులు పాల్గొన్నారు.

కౌశల్‌ పరీక్షకు

1,538 మంది హాజరు

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): విద్యార్థుల్లో సృజనాత్మకత, నూతన ఆవిష్కరణలపై నైపుణ్యాలను పెంపొందించడానికి నిర్వహించే కౌశల్‌–26 ఆన్‌లైన్‌ పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 204 పాఠశాలల నుంచి 1,538 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా విద్యా శాఖ అధికారి పిల్లి రమేష్‌ మంగళవారం ఈ విషయం తెలిపారు. తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఈ నెల 11న, పదో తరగతి విద్యార్థులకు 12వ తేదీన పరీక్షలు నిర్వహిస్తామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement