ప్రకృతిని ఆస్వాదిద్దామనుకుంటే ఆస్పత్రిపాలయ్యారు.. | - | Sakshi
Sakshi News home page

ప్రకృతిని ఆస్వాదిద్దామనుకుంటే ఆస్పత్రిపాలయ్యారు..

Oct 25 2026 12:23 AM | Updated on Oct 25 2026 12:23 AM

● సింగారమ్మచింత వద్ద టిప్పర్‌ బీభత్సం

● ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొన్న వైనం

● అన్నా చెల్లెళ్లకు తీవ్ర గాయాలు

● తోటి ప్రయాణికులకు స్వల్ప గాయాలు

● ప్రయాణికుల కేకలతో దద్దరిల్లిన

ఘటనాస్థలం

గోకవరం: ప్రకృతిని ఆస్వాదిద్దామని బస్సు ఎక్కి చివరిసీటులో కూర్చున్న ఆ అన్నా చెల్లెళ్లు లారీ ఢీకొన్న ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే గోకవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సుమారు 50 మంది ప్రయాణికులతో జగ్గంపేట నుంచి గోకవరం వస్తుండగా సింగారమ్మచింత వద్ద ప్రయాణికులను దించేందుకు ఆగింది. ఈ క్రమంలో జగ్గంపేట వైపు నుంచి వస్తున్న టిప్పర్‌ లారీ బస్సును ఢీకొట్టి ఈడ్చుకువెళ్లింది. దీంతో బస్సు వెనుక భాగం నుజ్జయ్యి వెనుక సీట్లో కూర్చున్న తొమ్మిదేళ్ల వాసుదేవ అనీష్‌, 13 ఏళ్ల వాసుదేవ ప్రభల్‌ సీట్ల మధ్య ఇరుక్కుపోయారు. ఈ ఘటనతో ప్రయాణికుల ఆర్తనాదాలు మిన్నంటాయి.

సీట్ల మధ్య ఇరుక్కుపోయిన ఆ అన్నాచెల్లెళ్లు నరకయాతన అనుభవించారు. సమాచారం అందుకున్న ఎస్సై పవన్‌కుమార్‌తో పాటు ఆర్టీసీ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి గంట పాటు శ్రమించి చిన్నారులను బయటకు తీశారు. వారిద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అమ్మమ్మగారి ఇంటికి వస్తూ

ప్రమాదంలో గాయపడిన చిన్నారులు ప్రభల్‌, అనీష్‌ తమ తల్లితో వీరలంకపల్లిలోని అమ్మమ్మ ఇంటికి వచ్చే క్రమంలో ఉదయం విశాఖ నుంచి జగ్గంపేటకు వచ్చి ఈ బస్సు ఎక్కి వెనుక సీట్‌లో కూర్చున్నారు. అటవీ ప్రాంతం కావడంతో ప్రకృతి అందాలు తిలకిస్తున్న వీరు ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఉప్పాడ–కోనపాపపేట మార్గంలో..

లారీ ఢీకొని ముగ్గురు మత్స్యకారులకు

తీవ్ర గాయాలు

కొత్తపల్లి: ఉప్పాడ– కోనపాపపేట బీచ్‌ రోడ్డులో శనివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మత్స్యకారులకు గాయాలయ్యాయి. మండలంలోని ఉప్పాడ గ్రామానికి చెందిన రాజపల్లి జాన్‌, రాచపల్లి శ్రీను, రాచపల్లి యల్లాజీ తెల్లవారు జామున రెండు మోటరు సైకిళ్లపై రామన్నపాలెం సమీపంలోని ఉప్పుటేరులో లంగరు వేసిన బోటు వద్దకు వెళుతున్నారు. ఉప్పాడ వైపు నుంచి కోనపాపపేట వైపు వెళుతున్న వారిని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ ముగ్గురికి తీవ్రగాయలు కావడంతో చికిత్స నిమిత్తం పిఠాపురం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ అతివేగం, నిర్లక్ష్యంగా రావడం వలనే ప్రమాదం జరిగిందని బంధువులు ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement