ఆదివారం శ్రీ 25 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
‘కూటమి’గా ఏర్పడ్డారు.. స్థానిక ఎన్నికల వేళ అడ్డదారులు
తొక్కుతున్నారు.. చివరికి ఎంతకై నా తెగిస్తున్నారు.. రాజకీయ విలువలను కాలరాస్తున్నారు. అధికారంలో ఉండి మరీ, గెలుపుపై ధీమా లేక ఇలా ప్రలోభాల పర్వానికి తెరలేపారు.. వైఎస్సార్ సీపీ అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేసేందుకు సర్వప్రయత్నాలు చేస్తున్నారు. చివరికి ఎవరూ దిగిరాకపోవడంతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. జిల్లాలో ఎన్నికలు ప్రజాస్వామ్య విలువలను మంటగలిపేలా
సాగుతున్నాయని ప్రజలు మండిపడుతున్నారు.
● వైఎస్సార్ సీపీ అభ్యర్థులే
లక్ష్యంగా ప్రలోభాలు
● ఓటమి భయంతో తెర వెనుక
‘కూటమి’ మంతనాలు
● నామినేషన్లు ఉపసంహరించుకోవాలని
బెదిరింపులు
● ముక్కొల్లు ఎంపీటీసీ అభ్యర్థిని ప్రలోభాలకు
గురిచేసి నామినేషన్ ఉపసంహరణ
● పిఠాపురంలోనూ ఇదే తంతు
● మూడు రోజులుగా పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా గృహ నిర్బంధం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి శ్రేణులు బరితెగిస్తున్నారు. ఓటమి భయంతో ప్రత్యర్థి వైఎస్సార్ సీపీ అభ్యర్థులను తమ వైపు తిప్పుకొనేందుకు తెర వెనుక వ్యూహాలు రచిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ, తుది జాబితా సైతం సిద్ధమైంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల పరిశీలన పూర్తయ్యింది. ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్రలోభాలకు గురిచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ప్రలోభాల పర్వానికి తెర తీసినట్లు సమాచారం. అంతర్గతంగా ఒక్కో అభ్యర్థిని సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. వాటికి లొంగని పక్షంలో బెదిరింపులకు సైతం వెనుకాడటం లేదన్న విషయం రాజకీయ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. నామినేషన్లు ఉపసంహరించుకోవాలని ఆదేశిస్తున్నట్లు తెలిసింది. అభ్యర్థులు ప్రలోభాలకు లొంగకపోతే, వారి కుటుంబ సభ్యులను బెదిరించి, వారి ద్వారా నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థిపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. పదవి, డబ్బు ఆశ చూపి అడ్డగోలు వ్యవహారానికి తెర తీస్తున్నారు. ఎలాగైనా నామినేషన్లు ఉపసంహరించుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు పడతారంటూ, వార్నింగ్ సైతం ఇస్తున్నట్లు తెలిసింది. కూటమి నేతల ప్రలోభాలకు వైఎస్సార్ సీపీ శ్రేణులు ఎవరూ నామినేషన్ల ఉపసంహరించుకోకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు.
ముక్కొల్లులో తెరపైకి వివాదం
కిర్లంపూడి మండలం ముక్కొల్లు ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్ సీపీ అభ్యర్థి కొండ ఆదినారాయణ నామినేషన్ దాఖలు చేశారు. అధికార పార్టీ నేతలు ఆ అభ్యర్థిని ప్రలోభాలకు గురిచేసినట్లు ఆరోపణలున్నాయి. నామినేషన్ విత్‌డ్రా చేసుకోవాలని బలవంతం చేయడం, సదరు అభ్యర్థిని ఎన్నికల రిటర్నింగ్ అధికారి విచారణ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై వైఎస్సార్ సీపీ జగ్గంపేట కోఆర్డినేటర్ తోట నరసింహం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతో కూటమి ప్రభుత్వం కుట్రలకు తెర తీస్తోందన్నారు. బలాబలాలు అనేవి ప్రజల్లో తేల్చుకోవాలే తప్ప ఇలాంటి అడ్డదారులు తొక్కడం సరికాదని హితవు పలికారు. కూటమి కుట్రలకు పోలీసులు భాగస్వాములు అవుతున్నారని దుయ్యబట్టారు.
ఎత్తుకెళ్లి.. బెదిరించి
డిప్యూటీ సీఎం పవన్ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురంలో బదిరింపుల పర్వానికి తెర లేచింది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 27వ వార్డులో కూటమి నేతలు కుట్రకు తెర తీశారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థి కంభంపాటి శ్రీరామ్‌ను ఎత్తుకెళ్లారు. కారులో దాచి, విత్‌డ్రా ఫారంపై సంతకం పెట్టించుకున్నారు. ఆ పత్రాన్ని ఎన్నికల అధికారులకు అప్పగించారు. ఈ ఘటన అనంతరం ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సదరు అభ్యర్థికి జనసేన కండువా కప్పుతున్న దృశ్యాలు హల్చల్ కావడంతో రాజకీయ నేతలంతా ముక్కునవేలేసుకున్నారు. అధికారం కోసం ఇంతటి అడ్డదారులు తొక్కడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి చేస్తే ప్రజలు పట్టం కడతారు కదా..? ఇలాంటి బెదిరింపు ధోరణులు ఎందుకంటూ నిట్టూరుస్తున్నారు. ఏదేమైనా ఈ రాజకీయాలను గమనిస్తున్న ప్రజలు కూటమి అభ్యర్థులకు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఎన్నికల సమయంలో గృహ నిర్బంధమా!
తుని: ఎన్నికల వేళ కూటమి నేతల కుట్రలు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయి. వైఎస్సార్ సీపీ శ్రేణులకు అందుబాటులో ఉండాల్సిన పార్టీ జిల్లా అధ్యక్షుడిని మూడు రోజులుగా గృహ నిర్బంధంలో ఉంచడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నామినేషన్ల సందర్భంగా పార్టీ క్యాడర్‌తో కలసి అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియలో కీలకంగా వ్యవహరించాల్సిన వైఎస్సార్ సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజాను గురు, శుక్రవారాల్లో గృహ నిర్బంధంలో ఉంచడం, శనివారం కూడా పోలీసులతో ఆయన్ని గృహ నిర్బంధం చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం, ఎన్నికల్లో విజయం సాధించేందుకు అభ్యర్థుల్లో ఉత్సాహాన్ని పెంపొందించడం కోసం వారితో కలసి ప్రజలను కలవడం వంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లేకుండా నిర్బంధం విధించడం గమనార్హం. మూడు మండలాలు, పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి సమయం లేకుండా పోలీసులు చేస్తున్నారని ఈ సందర్భంగా మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా విమర్శించారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవిలో ఉన్న నాయకుడిని ఎందుకు హౌస్ అరెస్ట్ పేరుతో ఇబ్బంది పెడుతున్నారో ప్రభుత్వం తరఫున పోలీసులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంక్షలు ఎత్తివేసి కార్యకర్తలను కలుసుకునే అవకాశం కల్పించాలని అన్నారు.


