బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో పరిషత్ ఎన్నికలకు సంబంధించి వేసిన నామినేషన్లలో కొన్ని సక్రమంగా లేక తిరస్కరించారు. జెడ్పీటీసీలకు సంబంధించి 42, ఎంపీటీసీలకు సంబంధించి 81 నామినేషన్లు తిరస్కరించారు. జిల్లాలో మూడు రోజుల వ్యవధిలో 401 ఎంపీటీసీ స్థానాలకు 2,218 నామినేషన్లు దాఖలు కాగా తిరస్కరించిన అనంతరం 2,137 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 20 జెడ్పీటీసీలు స్థానాలకు గాను 230 మంది నామినేషన్లు దాఖలు చేశారు. 42 నామినేషన్లను వివిధ కారణాలతో తిరస్కరించడంతో జెడ్పీటీసీలకు సంబంధించి 188 బరిలో ఉన్నారు.
పోలవరం జిల్లాకు పులి భయం!
దేవీపట్నం: చిక్కకుండా, దొరక్కుండా ముప్పుతిప్పలు పెడుతున్న పులి మళ్లీ పోలవరం జిల్లాలో అడుగుపెట్టే అవకాశం ఉందని అటవీ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. సుమారు 20 రోజుల క్రితం ఈ ప్రాంతంలో సంచరించి, సరిహద్దులోని సీతానగరం మండలంలో గోదావరిని దాటుకుని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు పులి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం ఆ జిల్లాలోని పాపికొండల అభయారణ్యానికి చేరుకున్నట్లు సమాచారం. ఏలూరు జిల్లాలోని గోదావరి నది పరివాహక ప్రాంతమైన కొరుటూరు, శివగిరి ప్రాంతంలో ఉన్న పెద్దపులి రాత్రికి గోదావరిని దాటి పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో అడుగుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి.
కిటకిటలాడిన రత్నగిరి
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలోని శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో స్వామివారి ఆలయం, ఆల య ప్రాంగణం రద్దీగా మారింది. వ్రత మండపా లు నిండిపోయాయి. సత్యదేవుని దర్శనానికి రెండు గంటలు, రూ.200 టిక్కెట్‌తో అంతరాలయ దర్శనానికి గంట సమయం పట్టింది. సుమారు 40 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు. సత్యదేవుడిని దర్శించిన అనంతరం సప్త గోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. స్వామివారి వ్రతాలు మూడు వేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. ఐదు వేల మంది భక్తులకు సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో ఉచిత భోజన సౌకర్యం కల్పించారు. కాగా, ఆదివారం విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు కావడంతో భక్తుల రద్దీ కొనసాగనుంది. దానికి తగ్గట్టు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
లింగ సమానత్వాన్ని
పెంపొందించండి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): సమాజంలో లింగ సమానత్వాన్ని పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి గర్భస్థ– పిండ లింగ నిర్ధారణ నిషేధిత చట్టం అమలు తీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తూ, గర్భస్థ శిశువు లింగ నిర్ధారణను నిరోధించాలని అధికారులను ఆదేశించారు. జన్యుపరమైన లోపాలు, వంశపారంపర్య వ్యాధులు, క్రోమోజోమ్ సంబంధిత అసాధారణతలను గుర్తించడం వంటి చట్టబద్ధమైన వైద్య అవసరాల కోసమే ప్రీ–నేటల్ డయాగ్నస్టిక్ పరీక్షలను నిర్వహించాలని స్పష్టం చేశారు. భ్రూణ హత్యలను అరికట్టి, బాలికా లింగ నిష్పత్తిని మెరుగుపరచడంతో పాటు, బాలికల పట్ల వివక్షను నిర్మూలించడమే లింగ నిర్ధారణ నిషేధిత చట్టం ప్రధాన లక్ష్యమన్నారు. లింగ నిర్ధారణ చేయడం చట్టరీత్యా నేరమన్నారు.


