● రైతన్నకు తుపాను గండం
● కోత దశలో ఖరీఫ్ పంట
● భారీ వర్షాలు కురిస్తే తీవ్ర నష్టం
బోట్ క్లబ్ (కాకినాడ సిటీ): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు రైతుల్లో గుబులు రేపుతున్నాయి. ఇప్పటికే కోత దశకు చేరుకున్న వరి పంటకు తుపాను ముప్పు పొంచి ఉండటంతో కలవరపడుతున్నారు. ఆదివారం నుంచి 29 వరకూ జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాకినాడ సమీపంలో తుపాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ జిల్లా అధికారులను అప్రమత్తం చేసింది. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో 90,298 హెక్టార్ల సాగు విస్తీర్ణానికి గాను, వర్షాభావ పరిస్థితుల కారణంగా కేవలం 87,023 హెక్టార్లలో మాత్రమే వరి సాగు అయ్యింది. ప్రస్తుతం వాతావరణం అనుకూలించడంతో పంటలు బాగా పండాయని, దీనివల్ల పంటకు మంచి గిట్టుబాటు ధర లభిస్తుందని రైతులు ఆశిస్తున్నారు. 75 కిలోల ధాన్యం బస్తాకు రూ.2,500 నుంచి రూ.3 వేల వరకు ధర లభిస్తుందని ఆశతో ఎదురుచూస్తున్న రైతులకు తుపాను హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. పంట చేతికొచ్చే సమయంలో భారీ వర్షాలు కురిస్తే తమ కష్టమంతా వృథా అవుతుందని వారు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలోని సామర్లకోట, పెద్దాపురం పరిసర ప్రాంతాలు, పెదపూడి, కిర్లంపూడి, గండేపల్లి మండలాల్లో ఇప్పటివరకు సుమారు 563 హెక్టార్లలో వరి కోతలు పూర్తయ్యాయి. మరో వారం నుంచి పది రోజుల్లో సుమారు 30 వేల నుంచి 40 వేల హెక్టార్లలో వరి కోతలు జరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.ఇలాంటి కీలక సమయంలో తుపాను ముప్పు పొంచి ఉండడం ఆందోళన కలిగిస్తోంది. భారీ వర్షాలు కురిస్తే కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట నేలకొరిగే ప్రమాదం ఉందని, ధాన్యం తడిసిపోతే నాణ్యత దెబ్బతిని ధర తగ్గే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
వివిధ రంగాలపై ప్రభావం
భారీ వర్షాలు, ఈదురు గాలులు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా అరటి, కొబ్బరి, కూరగాయల సాగు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం, పంటలు నేలకొరగడం, తోటలకు నష్టం వాటిల్లడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. విద్యుత్ సరఫరా, రవాణా వ్యవస్థలపైనా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. కోత దశలో ఉన్న పంటలను, ఇప్పటికే కోసి నిల్వ చేసిన ధాన్యాన్ని వర్షానికి తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. తుపాను ప్రభావం తగ్గే వరకు వరి కోతలను వాయిదా వేసుకోవాలని, ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాల్లో నిల్వ చేసుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు.
సహాయక చర్యలకు సిద్ధం కావాలి
తుపాను నేపథ్యంలో జిల్లాలోని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావంతో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, 24 గంటల్లో 20 నుంచి 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. 27వ తేదీ రాత్రి, 28వ తేదీ ఉదయం తుపాను తీరం దాటే అవకాశం ఉందని, తీరం దాటే ప్రాంతంపై ఈ నెల 26వ తేదీ సోమవారం ఉదయం స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలిపారు. తీర ప్రాంతాల్లోని మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకుండా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని సూచించారు. వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు రైతులను అప్రమత్తం చేసి కోతకు సిద్ధంగా ఉన్న పంటలను వీలైనంత త్వరగా కోసుకునేలా సూచనలు ఇవ్వాలన్నారు. ఈదురు గాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు నేలకూలే ప్రమాదం ఉన్నందున తగినన్ని విద్యుత్ స్తంభాలు, వైర్లు, ఇతర సామగ్రి, మరమ్మతు సిబ్బందిని ముందుగానే సిద్ధంగా ఉంచాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. తుపాను సన్నద్ధత చర్యల్లో భాగంగా ఈ నెల 29 వరకు ఎలాంటి సెలవులు మంజూరు చేయరాదని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


