బాలాజీచెరువు (కాకినాడ సిటీ): సర్కారీ బడుల్లో కూటమి కమిటీల పెత్తనానికి తెర లేచింది. గతంలో ఉన్న తల్లిదండ్రుల పర్యవేక్షణ కమిటీల పేరును పాఠశాల యాజమాన్య కమిటీలు(ఎస్‌ఎంసీ)గా కూటమి ప్రభుత్వం మార్చింది. ఈ ఎస్‌ఎంసీల ఎన్నికలు మంగళవారం జిల్లావ్యాప్తంగా 1,262 పాఠశాలల్లో నిర్వహించారు. మొత్తం 1,256 పాఠశాలల్లో చైర్మన్లు ఎంపికవగా, మిగిలిన 6 చోట్ల కోరం లేక వాయిదా వేశారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్, ఎయిడెడ్, కేజీబీవీ తదితర పాఠశాలల్లో ఈ ఎన్నికలు నిర్వహించారు. విద్యార్థి తల్లిదండ్రులలో ఒకరికి మాత్రమే ఓటు హక్కు కల్పిస్తూ చేతులెత్తే విధానంలో ఎన్నికలు జరిగాయి. ప్రతి తరగతి నుంచి ముగ్గురిని ఎంపిక చేసి, వారిలో ఒకరిని చైర్మన్‌గా ఎంపిక చేశారు. వీరితో పాటు కమిటీల్లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్, స్వయం సహాయక సంఘాల సభ్యులు, సర్పంచ్, ఉప సర్పంచ్‌లను నియమించారు. ఓ విద్యావేత్త, ఒక సోషల్ వర్కర్‌కు కో ఆప్షన్‌గా అవకాశం కల్పించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2024 ఆగస్టులో తొలిసారి ఎన్నికలు నిర్వహించగా ఆ కమిటీలకు రెండేళ్ల కాలపరిమితి ముగిసింది. దీంతో, మళ్లీ రెండేళ్ల కాలపరిమితికి కొత్త కమిటీల ఎన్నికలు నిర్వహించారు. ఎన్నిక అనంతరం నూతన చైర్మన్ అధ్యక్షతన మధ్యాహ్నం సమావేశం నిర్వహించారు. ఆయా పాఠశాలల్లో ప్రధాన సమస్యలు, ఉపాధ్యాయుల కొరత, మైనర్ మరమ్మతులు, ప్రభుత్వం నుంచి వచ్చిన గ్రాంటు, ఖర్చు, నిల్వ తదితర అంశాలపై చర్చించి, తీర్మానాలు చేశారు. జిల్లావ్యాప్తంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ లేకుండా, ఎస్‌ఎంసీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించామని జిల్లా విద్యా శాఖ అధికారి పిల్లి రమేష్ తెలిపారు. అవసరమైన చోట్ల పోలీసు, రెవెన్యూ అధికారుల సహకారం తీసుకున్నామని చెప్పారు.
పదవుల పంపకాలు
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా కేవలం తల్లిదండ్రులందరూ ఏకతాటిపై చదువుకున్న వారిని చైర్మన్‌గా ఎన్నుకునేవారు. చైర్మన్‌తో పాటు కమిటీ సభ్యులందరూ పాఠశాల అభివృద్ధికి తోడ్పడేవారు. దీనికి భిన్నంగా నేడు కూటమి సర్కారు ఈ ఎన్నికల్లో సైతం రాజకీయాలను చొప్పించింది. ఆయా పాఠశాలలపై స్థానిక కూటమి నాయకులు కన్ను వేశారు. కమిటీ చైర్మన్లుగా ఆయా పార్టీలో కష్టపడిన వారిని నియమించుకునేలా ఏర్పాట్లు చేసుకున్నారు. పాఠశాలకు అరకొరగా వచ్చే నిర్వహణ గ్రాంటుపై చైర్మన్లు అజమాయిషీ చేయనున్నారు. పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యంతో పాటు చక్కటి సలహాలు, సూచనలు ఇచ్చేవారిని ఎన్నుకోవాలని చెప్పినప్పటికీ చాలాచోట్ల అక్షర పరిజ్ఞానం లేనివారిని కూడా నియమించారు. చాలాచోట్ల ఈ పదవులను కూటమి పార్టీలు పంచుకున్నాయి. ఒక గ్రామంలో నాలుగు పాఠశాలలుంటే రెండు టీడీపీ, ఒకటి జనసేన మరొకటి బీజేపీకి ఇచ్చేలా ఒప్పందాలు చేసుకుని, నచ్చిన వారిని నామినేటెడ్ పదవుల తరహాలో నియమించేసుకున్నారు. చెరొక సంవత్సరం చైర్మన్‌గా ఉండేలా ఒప్పందం చేసుకుని కొన్నిచోట్ల ఏకగ్రీవం చేశారు. ఆయా పార్టీల గ్రామ కమిటీల అధ్యక్షులు, కార్యదర్శులుగా ఉన్నవారు స్కూల్ కమిటీ చైర్మన్లుగా నియమితులయ్యారు.
ఫ జిల్లావ్యాప్తంగా
1,256 ఎస్‌ఎంసీల ఎన్నిక
ఫ కోరం లేక ఆరు పాఠశాలల్లో వాయిదా


