పోలీసుల దౌర్జన్యంపై న్యాయవాదుల నిరసన | - | Sakshi
Sakshi News home page

పోలీసుల దౌర్జన్యంపై న్యాయవాదుల నిరసన

Oct 1 2026 12:29 AM | Updated on Oct 1 2026 12:29 AM

కాకినాడ లీగల్‌: విజయవాడలో న్యాయవాదులపై పోలీసులు చేసిన దౌర్జన్యాన్ని నిరసిస్తూ ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌ (ఐలూ) ఆధ్వర్యాన కాకినాడ బార్‌ అసోసియేషన్‌ వద్ద న్యాయవాదులు బుధవారం ఆందోళన నిర్వహించారు. న్యాయవా ది ఒగ్గు గవాస్కర్‌పై చట్ట విరుద్ధంగా రౌడీ షీట్‌ తెరవాలనే ప్రయత్నాలను విరమించుకోవాలని, న్యాయవాది సుభానీపై నమోదు చేసిన అక్రమ కేసు, సివిల్‌ వివాదానికి సంబంధించి మరో న్యాయవాది పలగాని రవిపై పెట్టిన కేసు ఎత్తివేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఐలూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు మేడపాటి ధర్మారెడ్డి మాట్లాడుతూ, విజయవాడ బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి, ఎంజీ రోడ్డులోని బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పించేందుకు శాంతియుతంగా ప్రదర్శనగా వెళ్తూండగా పోలీసులు దౌర్జన్యానికి పాల్పడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళా న్యాయవాదులపై దౌర్జన్యానికి పాల్ప డటం అప్రజాస్వామికమని అన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కాలరాసే అధికా రం పోలీసులకు లేదన్నారు. న్యాయవాదుల ఆందోళనను అణచివేసేందుకు రోప్‌ పార్టీలతో నిర్బంధానికి పాల్పడటాన్ని తీవ్రంగా ఖండించారు. ఇటీ వలి కాలంలో న్యాయవాదులపై పోలీసులు దౌర్జ న్యాలకు పాల్పడుతున్నారని, దీనిని అరికట్టేందుకు న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే రూపొందించి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మారెడ్డి డిమాండ్‌ చేశారు. విజయవాడ ఘటనకు బాధ్యులైన పోలీసు అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని ఐలూ జిల్లా, నగర కమిటీలు డిమాండ్‌ చేశాయి. నిరసన కార్యక్రమంలో కాకినాడ బార్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పి.రామచంద్రరాజు, ఐలూ జిల్లా ట్రెజరర్‌ బహుదూర్‌ షా వెంకటరెడ్డి, సిటీ కార్యదర్శి కె.నాగజ్యోతి, న్యాయవాదులు మహ్మద్‌ జవహర్‌ అలీ, ఇజాజుద్దీన్‌, హయగ్రీవరావు, పి.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement