పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి సహకారం | - | Sakshi
Sakshi News home page

పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి సహకారం

Sep 30 2026 12:10 AM | Updated on Sep 30 2026 12:10 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): జిల్లాలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తామని కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిర ప్రసాద్‌ అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) 32వ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. సిసంగిల్‌ డెస్క్‌ విధానంలో 46 దరఖాస్తులు అందగా 33 దరఖాస్తులకు అన్ని అనుమతులూ మంజూరు చేశామని, 13 దరఖాస్తులు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పాన్నారు. జిల్లాలో 16 పరిశ్రమల ఏర్పాటుకు కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని అనుమతులూ నిర్ణీత సమయంలో మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. పారిశ్రామికవేత్తల సమస్యలను సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పరిష్కరించాలని కలెక్టర్‌ ఆదేశించారు. బ్యాంకర్ల వద్ద పెట్టుబడిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎల్‌డీఎం ప్రత్యేక చొరవతో పరిష్కరించాలని సూచించారు. వచ్చే నెల 12న జేఎన్‌టీయూకేలో ఉభయ గోదావరి జిల్లాల స్థాయిలో ప్రాంతీయ సదస్సు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ఈ సదస్సు నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.

కాకినాడ చేరిన రెండో

విడత ఎన్నికల సామగ్రి

కాకినాడ లీగల్‌: మున్సిపల్‌ పోరు నిర్వహణకు సంబంధించి రెండో విడత ఎన్నికల సామగ్రి మంగళవారం కాకినాడ చేరుకుంది. జిల్లాలోని మున్సిపాలిటీలకు ఎన్నికల సామగ్రి పంపిణీ చేసేందుకు కాకినాడ నగర పాలక సంస్థ కార్యాలయం స్టాక్‌ పాయింట్‌గా ఉంది. వచ్చిన సామగ్రిని నగర పాలక సంస్థ కమిషనర్‌ ఎన్‌వీవీ సత్యనారాయణ, అదనపు కమిషనర్‌ కేటీ సుధాకర్‌ పర్యవేక్షణలో అధికారులు స్వీకరించి, స్ట్రాంగ్‌ రూములో భద్రపరిచారు. ఖాళీ బ్యాలెట్‌ పేపర్లు, ఇతర కీలక సామగ్రి ఇందులో ఉన్నాయి. స్ట్రాంగ్‌ రూము వద్ద పోలీసు భద్రత కల్పించామని సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేశామని కమిషనర్‌ చెప్పారు. ఎన్నికల షెడ్యూల్‌కు అనుగుణంగా అవసరమైన సమయంలో సంబంధిత మున్సిపాలిటీలకు ఎన్నికల సామగ్రిని సురక్షితంగా తరలిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేషన్‌ మేనేజర్‌ శిరీష్‌, అకౌంటెంట్‌ జయరాం, సూపరింటెండెంట్‌ సీతారాం, ఎలక్ట్రికల్‌ ఏఈ అర్జున్‌ తదితరులు పాల్గొన్నారు.

తగ్గుతున్న గోదావరి వరద

ఐ.పోలవరం/అయినవిల్లి: గోదావరి వరద క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఎగువ నుంచి ఇన్‌ఫ్లో తగ్గడంతో ధవళేశ్వరంలోని సర్‌ ఆర్థర్‌ కాటన్‌ బ్యారేజీ వద్ద ప్రవాహం తగ్గుతోంది. సోమవారం సాయంత్రం 6 గంటలకు 9,69,911 క్యూసెక్కులుగా ఉన్న మిగులు జలాలు మంగళవారం సాయంత్రం 6 గంటలకు 6,38,771 క్యూసెక్కులకు తగ్గాయి. వరద తగ్గుతూండటంతో గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలు క్రమంగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద సోమవారం రాత్రి 10 గంటలకు మిగులు జలాలు 9,47,047 క్యూసెక్కులకు, మంగళవారం ఉదయం 6 గంటలకు 8,33,506 క్యూసెక్కులకు, మధ్యాహ్నం 3 గంటలకు 6,71,221 క్యూసెక్కులకు, సాయంత్రం 6 గంటలకు 6,38,771 క్యూసెక్కులకు తగ్గాయి. వరద తగ్గుతున్నప్పటికీ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇంకా ముంపు కొనసాగుతోంది. ముక్తేశ్వరం కాజ్‌వేపై ముంపు కాస్త తగ్గినప్పటికీ సాయంత్రం సమయానికి ఒక అడుగు మేర వరద నీరు ప్రవహిస్తోంది. పడవలపై రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ప్రస్తుతం వాహనాల రాకపోకలు మొదలయ్యాయి. మామిడికుదురు మండలం అప్పనపల్లి కాజ్‌వేపై కూడా వరద నీరు తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ, రాకపోకలు సాగించే వీలు లేకపోవడంతో వాహనాలను మామిడికుదురు మీదుగా మళ్లిస్తున్నారు. వృద్ధ గౌతమీ పాయలోని పల్లపు ప్రాంతాల్లో ఇంకా వరద నీరు ఉంది. ఐ.పోలవరం మండలం మురమళ్ల రాఘవేంద్ర వారధి వద్ద వరద నీరు పాంచాల రేవు దాటి ఇళ్ల సమీపానికి చేరింది. మంగళవారం సాయంత్రం నుంచి నీటిమట్టం తగ్గుతూండటంతో స్థానికులు ఊపిరి పీల్చుకుంటున్నారు. పి.గన్నవరం మండలం కనకాయలంక కాజ్‌వేపై ఇంకా ముంపు కొనసాగుతోంది. పి.గన్నవరం అక్విడెక్టు వద్ద గోదావరి ప్రవాహం ఉధృతంగానే ఉంది. ధవళేశ్వరం వద్ద ప్రవాహం క్రమంగా తగ్గుతూండటంతో దిగువన ఉన్న జిల్లాలోనూ బుధవారం ఉదయం నాటికి వరద ఉధృతి మరిత తగ్గనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement