అమలాపురం టౌన్: రెండున్నర దశాబ్దాలైనా కోనసీమ ప్రజలు నేటికీ రైలు కోసం ఎదురు చూపులు చూసే దుస్థితి నెలకొందని కోనసీమ రైల్వే సాధన సమితి (కేఆర్‌ఎస్‌ఎస్) స్టీరింగ్ కమిటీ ప్రతినిధి, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు అసహనం వ్యక్తం చేశారు. జిల్లా వాసుల చిరకాల కోర్కె అయిన రైలును త్వరితగతిన తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ‘కోనసీమ రైలు కోసం ప్రజాగళం’ పేరిట కేఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యాన స్థానిక కల్వకొలను వీధిలో మంగళవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం తగిన నిధులిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ నత్తనడకన నిర్వహిస్తోందని విమర్శించారు. ఈ నిర్లక్ష్యం వల్లనే ఈ రైల్వే లైను నిర్మాణంలో దశాబ్దాల తరబడి జాప్యం జరుగుతోందని అన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన కేఆర్‌ఎస్‌ఎస్ స్టీరింగ్ కమిటీ కన్వీనర్ డాక్టర్ ఈఆర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, కోటిపల్లి – నర్సాపుం రైల్వే లైనుకు మూడు నదులపై వంతెనల నిర్మాణం జరుగుతున్నా.. ఈ లైనుకు అవసరమైన భూసేకణ అంత వేగంగా జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేఆర్‌ఎస్‌ఎస్ స్టీరింగ్ కమిటీ సభ్యుడు, పట్టణ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కల్వకొలను తాతాజీ మాట్లాడుతూ, కోనసీమ రైలు కోసం ఓ రోజు కోనసీమ బంద్‌కు పిలుపు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కాకినాడ రైల్వే ప్యాసింజర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వైడీ రామారావు మాట్లాడుతూ, కాకినాడను మెయిన్ లైన్‌లో కలపాలనే డిమాండుతో తాను కొన్ని దశాబ్దాలుగా పోరాడుతున్నానని చెప్పారు. త్వరలోనే కోనసీమ ప్రజాప్రతినిధుల సమక్షంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కదలిక తీసుకురావాలని సమావేశం తీర్మానించింది. ఈ సమావేశంలో డాక్టర్లు, లాయర్లు, టీచర్లు, ప్రజా, రైతు, కార్మిక సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు తదితర అన్ని వర్గాల వారూ కోనసీమ రైలు కోసం గళం విప్పారు. కేఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధులు సప్పా నాగేశ్వరరావు, ఉప్పుగంటి భాస్కరరావు, పోలిశెట్టి శివాజీ, ఎరగర్త వెంకటేశ్వరరావుతో పాటు వివిధ సంఘాల ప్రతినిధులు యెండూరి నాగేశ్వరరావు, కారెం వెంకటేశ్వరరావు తదితరులు ప్రసంగించారు.
ఫ రెండున్నర దశాబ్దాలైనా
ఎదురు చూపులేనా?
ఫ కోనసీమ ప్రజల చిరకాల కోర్కెను
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీర్చాలి
ఫ భూసేకరణ వేగవంతం చేయాలి
ఫ రౌండ్ టేబుల్ సమావేశంలో
ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు


