తాండవ ఫర్‌ సేల్‌ | - | Sakshi
Sakshi News home page

తాండవ ఫర్‌ సేల్‌

Sep 30 2026 12:10 AM | Updated on Sep 30 2026 12:10 AM

తుని: నాలుగు నియోజకవర్గాలకు చెందిన రైతులకు అన్నం పెట్టిన తాండవ సహకార చక్కెర కర్మాగారాన్ని చంద్రబాబు ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. సహకార రంగంలోని అన్ని చక్కెర పరిశ్రమలనూ అమ్మేసి కార్మికులు, రైతులు, ప్రభుత్వ రంగ సంస్థల బకాయిలు చెల్లించాలంటూ ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది అమలులోకి వస్తే.. వందలాది మంది రైతులు, కార్మికులకు అన్నం పెట్టిన ఈ సుగర్‌ ఫ్యాక్టరీ ఇకపై కాలగర్భంలో కలసిపోనుంది. ఈ పరిశ్రమకు రూ.వందల కోట్ల ఆస్తులున్నాయి. కానీ, కేవలం రూ.38 కోట్ల బకాయిలను సాకుగా చూపి ఈ పరిశ్రమకు కూటమి ప్రభుత్వం ఉరి బిగిస్తోంది. ఎంతో మందికి మేలు చేసిన ఈ పరిశ్రమకు చేయూతనిచ్చి, తెరిపించాల్సింది పోయి, అమ్మేయాలని ప్రభుత్వం నిర్ణయించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆదుకున్న వైఎస్సార్‌, జగన్‌

చంద్రబాబు పాలనా విధానాలతో పుట్టెడు కష్టాల్లో కూరుకుపోయిన సహకార చక్కెర కర్మాగారాలను డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆదుకున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టన్నుకు రూ.300 చొప్పున ప్రభుత్వం ప్రోత్సాహకం చెల్లించేది. తద్వారా ఈ పరిశ్రమ నాలుగేళ్ల పాటు నిరంతరాయంగా నడిచింది. ఆ తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఈ పరిశ్రమను నిర్వహించడం కంటే విక్రయించడం పైనే దృష్టి పెట్టింది. ముగ్గురు మంత్రులతో కూడిన కమిటీ వేసి కాలక్షేపం చేసిందే తప్ప, ఈ పరిశ్రమను కష్టాల నుంచి గట్టెక్కించడంపై ఏమాత్రం దృష్టి పెట్టలేదు. ఫలితంగా 2019లో వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చేనాటికి ఇక్కడి రైతులకు రూ.10 కోట్ల బకాయిలున్నాయి. రైతుల ఇబ్బందులను గమనించిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో బకాయిలు పూర్తిగా చెల్లించారు. అంతకు ముందు చంద్రబాబు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేకపోవడంతో రైతులు క్రమంగా చెరకు సాగు తగ్గించేయడంతో ఈ పరిశ్రమ మూత పడింది. ఇప్పుడు మరోసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా ఈ పరిశ్రమను అమ్మకానికి పెట్టింది.

పాయకరావుపేటలోని తాండవ సుగర్‌ ఫ్యాక్టరీ

చంద్రబాబు పాలనలో చిన్నచూపు

ప్రపంచ బ్యాంకు సంస్కరణల అమలులో భాగంగా 90వ దశకం చివరిలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం లేదా మూసివేత చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే సహకార రంగాన్ని కూడా ప్రైవేటీకరించే చర్యలకు పూనుకుంది. ఆ సమయంలోనే వివిధ సహకార డెయిరీలు, సహకార చక్కెర కర్మాగారాలకు నాటి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం, రైతులకు ప్రోత్సాహం కరువైంది. ఫలితంగా అవి ప్రైవేటు పరం కావడమో, మూత పడటమో జరిగిందనే విమర్శలున్నాయి. వాస్తవానికి అప్పటి నుంచే తాండవ సుగర్స్‌కు కష్టాలు ప్రారంభమయ్యాయి. గతంలో తాండవ సుగర్స్‌ పరిధిలోని రైతులు 2.40 లక్షల టన్నుల క్రషింగ్‌కు అవసరమైన చెరకు పండించేవారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం రైతులకు ఏ విధమైన ప్రోత్సాహకాలూ ఇవ్వలేదు. మరోవైపు సాగు పెట్టుబడులు పెరగడం, ప్రభుత్వ తోడ్పాటు లేక ఫ్యాక్టరీ గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోయారు. ఫలితంగా చెరకు సాగు గణనీయంగా తగ్గిపోయింది. వీటన్నింటి ఫలితంగా ఈ పరిశ్రమ మూత పడింది.

ఫ అమ్మకానికి పెట్టిన కూటమి ప్రభుత్వం

ఫ కాలగర్భంలో కలవనున్న

చక్కెర పరిశ్రమ

ఫ ఎంతోమంది ఆకలి తీర్చిన

కర్మాగారానికి సర్కారు ఉరి

ఫ చంద్రబాబు హయాంలోనే

ఈ పరిశ్రమకు కష్టాలు

ఫ ప్రభుత్వ సహకారం లేక

పతనం ప్రారంభం

1963లో ప్రారంభం

మెట్ట ప్రాంతంలో ఏర్పాటు చేసిన తొలి పరిశ్రమ తాండవ సుగర్స్‌. తుని నియోజకవర్గ తొలి ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌వీవీ కృష్ణంరాజు బహుదూర్‌ (రాజా బుల్లిబాబు) కృషి మేరకు రైతులతో కలసి ఈ పరిశ్రమను సహకార రంగంలో 1963లో ప్రారంభించారు. దీనికి అప్పటి ఉమ్మడి విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల పరిధిలోని తుని, ప్రత్తిపాడు, పాయకరావుపేట, నర్సీపట్నం నియోజకవర్గాలకు చెందిన రైతులు చెరకు సరఫరా చేసేవారు. మొత్తం 11 వేల మంది రైతులు షేర్‌ హోల్డర్లుగా ఉండగా, 425 మంది కార్మికులు పని చేసేవారు. అప్పట్లో రోజుకు 1,600 టన్నుల క్రషింగ్‌ సామర్థ్యంతో ప్రారంభమైన ఈ పరిశ్రమ మూసివేత సమయానికి 2,400 టన్నుల స్థాయికి చేరింది.

జీవనోపాధి పోతుంది

ఫ్యాక్టరీలో పని చేస్తున్న కార్మికులకు ఏళ్ల తరబడి జీతాలు చెల్లించడం లేదు. రెండేళ్ల బోనస్‌ ఇవ్వలేదు. పర్మినెంట్‌, సీజనల్‌, ఎన్‌ఎంఆర్‌లు కలిపి సుమారు 400 మంది కార్మికులు ఈ పరిశ్రమలో పని చేస్తున్నారు. కార్మికులకు రూ.18 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. యాజమాన్యాన్ని అడిగితే పరిశ్రమ నష్టాల్లో ఉందని చెబుతున్నారు. అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకొస్తున్నాం. ఇప్పుడు ఏకంగా ఫ్యాక్టరీనే అమ్మేస్తున్నారు. దీంతో, దీనిని నమ్ముకుని ఉన్న వందల కుటుంబాల జీవనోపాధి పోతుంది. కార్మికులకు పూర్తి స్థాయి జీతాలు చెల్లించడంతో పాటు జీవనోపాధికి కూడా దారి చూపించాలి.

– డి.నారాయణస్వామి, కార్యదర్శి,

తాండవ సుగర్స్‌ కార్మిక యూనియన్‌

అమ్మకానికి పెట్టడం సరికాదు

ఎన్నో ఇబ్బందులు పడి ఫ్యాక్టరీకి చెరకు తోలితే యాజమాన్యం చెల్లింపుల్లో నిర్లక్ష్యం వహించింది. 2020 క్రషింగ్‌ సీజన్‌ వరకూ ఫ్యాక్టరీకి సరఫరా చేసిన చెరకుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషితో చెల్లించారు. చెరకు సాగు స్వస్తి పలికి వరి, వాణిజ్య పంటలు సాగు చేస్తున్నాం. ఈ ఫ్యాక్టరీని ప్రభుత్వం అమ్మకానికి పెట్టడం సరికాదు.

– వై.రామ సూర్య సత్యనారాయణ,

చెరకు రైతు, బొద్దవరం

4 నియోజకవర్గాల రైతులకు

తీరని అన్యాయం

తాండవ సుగర్‌ ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టడం ద్వారా నాలుగు నియోజకవర్గాల రైతులకు ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది. టీడీపీ ప్రభుత్వం కొత్త పరిశ్రమలను తీసుకురాదు. ఉన్న పరిశ్రమలను మూసివేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన విద్య. సుగర్‌ ఫ్యాక్టరీ అమ్మకం విషయంలో పునరాలోచించాలి. కార్మికులను దృష్టిలో పెట్టుకోవాలి.

– దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి,

వైఎస్సార్‌ సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement