● పాఠశాల బయట పోకిరీల వేధింపులు
● ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు
● ఎస్‌ఎంసీ సమావేశంలో
తల్లిదండ్రుల ఆవేదన
రంపచోడవరం: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న బాలికలకు రక్షణ లేకుండా పోయిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం జరిగిన స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్‌ఎంసీ) సమావేశంలో పాఠశాల పనితీరు, విద్యార్థుల పరిస్థితిపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో తమ పిల్లలను చదివించలేమంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
సిగరెట్లు కాలుస్తున్న విద్యార్థులు
ఈ పాఠశాలలో చదివే 45 మంది విద్యార్థులు సిగరెట్లు కాలుస్తున్నారని ఉపాధ్యాయులే చెబుతున్నారని తల్లిదండ్రులు చెప్పారు. ఈ పరిస్థితుల్లో మిగిలిన విద్యార్థు పరిస్థితేమిటని ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోని ఈ పాఠశాల గురించి ఏ అధికారీ పట్టించుకోవడం లేదన్నారు. ఆడపిల్లలను బడికి పంపే పరిస్థితి లేదని వాపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని అన్నారు. పాఠశాల అయిన తరువాత రోడ్డుపై ఆడపిల్లలు నడచి వెళ్లుతుంటే పోకిరీలు వేధిస్తున్నారన్నారు. గతంలో సీఎం సభ జరిగినప్పుడు అన్ని విషయాలూ చెబుతామంటే మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో తమ పిల్లలను బడి మాన్పించేస్తామని చెప్పారు.
ఇక్కడే డీఈఓ కార్యాలయం ఉన్నా..
జిల్లాలోని జిల్లా పరిషత్, ప్రభుత్వ, మండల పరిషత్ పాఠశాలలను పర్యవేక్షించే జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) కార్యాలయం రంపచోడవరం ప్రభుత్వ పాఠశాల ఆవరణలోనే ఉంది. అయినప్పటికీ డీఈఓ శ్రీరామ్మూర్తి ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. తన కార్యాలయం ఉన్న పాఠశాలలోనే విద్యార్థులు విచ్చలవిడి అలవాట్లకు లోనవడం వంటి అనేక సమస్యలున్నా పట్టించుకోవడం లేదని అంటున్నారు. అటువంటప్పుడు ఇక్కడ డీఈఓ కార్యాలయం ఎందుకున్నట్టని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఎంతో పేరున్న ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న పరిస్థితులపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


