కాకినాడ క్రైం: రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు కలెక్టరేట్ ఆవరణలో పెన్షనర్లు మంగళవారం నిరసన చేపట్టారు. ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యాన నిరసన గళం వినిపించారు. ఏపీఎన్‌జీవో సంఘం ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు ఆచంట రామానాయుడు, పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కేపీ జగదీశ్వరరావు, జిల్లా జేఏసీ చైర్మన్ జి.రామ్మోహన్, ఎన్‌జీవో సంఘం జిల్లా కార్యదర్శి పాలపర్తి మూర్తిబాబు పెన్షనర్ల సమస్యలపై మాట్లాడారు. న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చవలసిన బాధ్యత కేంద్రంపై ఉందని అన్నారు. దేశవ్యాప్తంగా పెన్షనర్లు 12 డిమాండ్లపై పోరాడుతున్నారని, వీటిని పరిష్కరించాలని అన్నారు. పెన్షన్ కమ్యుటేషన్ 15 ఏళ్లకు పెట్టడం సరికాదన్నారు. రైల్వే సీనియర్ సిటిజన్ రాయితీని పునరుద్ధరించాలని కోరారు. జిల్లావ్యాప్తంగా అసోసియేషన్ అన్ని యూనిట్ల అధ్యక్ష కార్యదర్శులు ఈ నిరసనలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.


