ప్రత్తిపాడు: మండలంలోని టి.రాయవరం సమీపంలోని చేపల చెరువు లీజు దారుడి హత్య కేసులో ప్రధాన సూత్రధారి హతుని కుమార్తెను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం టి.రాయవరం గ్రామ శివారున చేపల చెరువు మకాం వద్ద ఈనెల 11 అర్ధరాత్రి ఏలూరు జిల్లా పైడి చింతపర్రుకు చెరువు లీజుదారు మోరి నరసింహారావు (70) హత్య కేసులో నిందితుడు అనకాపల్లి జిల్లా పాయకరావు పేట మండలం పడాల లక్ష్మీపురం గ్రామానికి చెందిన వేన్ డ్రైవర్ వీర్ల జయ నాగ వెంకట సత్యనారాయణ అనే జయబాబును శుక్రవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న తండ్రిని పథకం ప్రకారం అతడితో హత్య చేయించిన బలే నాగలక్ష్మిని స్థానిక జాతీయ రహదారిపై పాదాలమ్మ తల్లి ఆలయం సమీపంలో అదుపులోకి తీసుకున్నట్టు ఎస్సై ఎస్.లక్ష్మీకాంతం తెలిపారు.
వ్యాన్ ఢీకొని
ఇద్దరికి గాయాలు
వాహనంలో కిక్కిరిసి ఎద్దుల తరలింపు
గండేపల్లి: ఎద్దులను తరలిస్తున్న వ్యాన్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. శనివారం జరిగిన ఈ ఘటనపై స్థానికుల సమాచారం మేరకు విజయనగరం జిల్లా అలమండ సంత నుంచి ఏలూరుకు 8 ఎద్దులను తరలిస్తున్న మినీ బొలేరో వ్యాన్ కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలోని జెడ్ రాగంపేట సీహెచ్‌సీకి వెళ్లే మార్గంలోకి వచ్చే సరికి మోటార్ సైకిల్‌ను డీకొంది. ఈ ప్రమాదంలో మోటార్ సైకిల్ నడుపుతున్న తాళ్లూరుకు చెందిన సాయి తీవ్రంగా గాయపడగా, మర్రిపాక నుంచి మిరప కోతకు యల్లమిల్లి వెళుతున్న లక్ష్మి గాయపడిందన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సీహెచ్‌సీకి తరలించగా తీవ్రంగా గాయపడిన సాయిని జగ్గంపేట ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. ఎద్దులను తరలిస్తున్న వ్యాన్‌ను గండేపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా వ్యాన్‌లో తరలిస్తున్న ఎద్దులకు ఎటువంటి ఆహార పానీయాలు లేకపోగా కనీసం కాలు కదపలేని స్థితిలో కిక్కిరిసిన ప్రయాణంతో వేదన పడుతున్న తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
చికిత్స పొందుతూ
వ్యక్తి మృతి
సామర్లకోట: పెద్దాపురం మండలం మర్లావ మద్యం దుకాణం వద్ద ఘర్షణలో గాయపడిన వ్యక్తి కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. సీఐ వైఆర్‌కె శ్రీనివాసు కథనం ప్రకారం తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం, పెద్దేవం గ్రామానికి చెందిన రాజేంద్రబాబు (34) మర్లావ మద్యం దుకాణంలో రెండేళ్లుగా సేల్స్‌మన్‌గా పనిచేస్తున్నాడు. దుకాణం యజమాని మోహన్ ప్రసాద్ డబ్బులు బాకీ విషయంలో అడిగాడని మనస్తాపం చెందిన రాజేంద్రబాబు శనివారం ఉదయం బ్రాందీ షాపు వద్ద గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే స్థానికులు అతనిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడని సీఐ తెలిపారు. ఎస్సై పాపారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


