● గత నెల 23న కొంతమూరులో జరిగిన
చోరీ కేసులో చిక్కిన వైనం
● నిందితుల నుంచి
బంగారు, వెండి ఆభరణాల స్వాధీనం
రాజానగరం: స్థానిక పోలీసు స్టేషను పరిధిలోని కోలమూరులో ఇద్దరు అంతర్ జిల్లా దొంగలు పోలీసులకు చిక్కారు. సీఐ వీరయ్యగౌడ్ శనివారం ఇక్కడ మీడియాకు తెలిపిన వివరాలిలావున్నాయి. గత నెల 23న కొంతమూరులోని ఓ ఇంటిలో జరిగిన చోరీపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖ, అనకాపల్లి, ఏలూరు జిల్లాలో వారిపై పలు కేసులు నమోదైన విషయం బయటపడింది. ఏలూరుకు చెందిన తురకా దుర్గారావు, విశాఖపట్నంలోని కంచరపాలేనికి చెందిన గుడిబోయిన ఉదయ్‌కిరణ్ కొంతమూరులో జరిగిన చోరీతో పాటు అనకాపల్లి మండలం గవరపాలెంలో మరో ఇంటిలో తాళాలు పగులగొట్టి దొంగతానికి పాల్పడ్డారు. వారి నుంచి 40 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండి వస్తువులతో పాటు రెండు సెల్‌ఫోన్లు, రెండు వాచీలు, ఒక బైకును స్వాధీనం చేసుకున్నారు. దుర్గారావుపై ఏలూరు, కొయ్యలగూడెం, గాజువాక, విజయనగరం, విశాఖ–1 పోలీసు స్టేషన్లలో 13 కేసులు, ఉదయ్‌కిరణ్‌పై కంచరపాలెం పీఎస్‌లో రౌడీ షీడ్ ఉండటమే కాకుండా ఆ పీఎస్‌తో పాటు, గాజువాక, విశాఖ ప్రాంతాల్లో 8 కేసులు నమోదై ఉన్నాయి. పగలంతా రెక్కీ నిర్వహించి, రాత్రి వేళలలో ఇళ్లలో దొంగతనాలు చేస్తుంటారన్నారు. నిందితులిద్దరినీ రిమాండ్‌కు పంపించామని సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్సై ప్రియకుమార్, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.


