● కులం పేరుతో దూషణ..
● నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
ఐ.పోలవరం: ఒక వివాహితపై ఓ కుటుంబం దాడి చేసి కులం పేరుతో దూషించిన ఘటనపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండలం పశువుల్లంక గ్రామానికి చెందిన కమిడి వెంకట సుబ్బలక్ష్మి ఇద్దరు పిల్లలతో స్థానిక బీసీ కాలనీలో ధూళిపూడి చక్రంకు చెందిన భవనంలో ఒక పోర్షన్‌లో అద్దెకు నివసిస్తోంది. అదే భవనంలోని మరో మూడు పోర్షన్లలో ఏడాదిగా పల్లం గ్రామానికి చెందిన దోమ వీరబాబు, అతని తల్లిదండ్రులు, అన్నా తమ్ముళ్లు నివసిస్తున్నారు. వీరబాబు వ్యాపారం నిమిత్తం సుబ్బలక్ష్మి వద్ద దఫదఫాలుగా సుమారు రూ.2.25 లక్షలు వడ్డీకి రుణం తీసుకున్నాడు. అయితే గత రెండు నెలలుగా వడ్డీ చెల్లించకపోవడంతో గత 16 తేదీ బుధవారం రాత్రి వీరబాబును డబ్బుల కోసం బాధిత మహిళ నిలదీసింది. దీంతో డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు.. దిక్కున్న చోట చెప్పుకోమంటూ కులం పేరుతో దూషించి దుర్భాషలాడారని, అంతటితో ఆగకుండా వీరబాబు, అతని తండ్రి, అతను సోదరుడు స్వామి తన ఇంటి వద్దకు వచ్చి భౌతిక దాడికి పాల్పడి గాయపరిచారని సుబ్బలక్ష్మి పేర్కొంది. అడ్డువచ్చిన తన పిల్లలపై కూడా దాడి చేశారని, గాయాల పాలైన తనను కాపవరపు వీరభద్రరావు ఆటోలో టి.కొత్తపల్లి పీహెచ్‌సీకి తీసుకువెళ్లి వైద్యం చేయించారని తెలిపింది. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు ఎస్సై ఎం.రవీంద్రబాబు తెలిపారు.


