ఇలా వెలుగుబెట్టారు! | - | Sakshi
Sakshi News home page

ఇలా వెలుగుబెట్టారు!

Aug 21 2026 12:28 AM | Updated on Aug 21 2026 12:28 AM

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఆగస్టు 20.. ఈ రోజుకు కాకినాడ జేఎన్‌టీయూ చరిత్రలో ఎంతో ప్రాధాన్యం ఉంది. అది యూనివర్సిటీ ఏర్పాటైన రోజు కావడంతో వ్యవస్థాపక దినోత్సవం ఏటా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సరిగ్గా 18 ఏళ్ల నుంచి కోవిడ్‌ సమయంలో తప్ప ఈ రోజు యూనివర్సిలో సందడే సందడి. విద్యార్థుల కోలాహలం.. ప్రొఫెసర్ల మాటామంతి.. ముఖ్య అతిథులు, ఆపై పూర్వ విద్యార్థులతో వర్సిటీలో కొత్త వెలుగులు నిండేవి. అలాంటి రోజు గురువారం కావడం, ఆ వెలుగులు, సందడి నేడు దూరమవడం అందరినీ విస్మయానికి గురి చేసింది. దీనికి కారణం ఏమిటోనని ఆ యూనివర్సిటీలోని కొందరు ప్రొఫెసర్లు చర్చించుకోవడం కనిపించింది. వ్యవస్థాపక దినోత్సవాన్ని ఇలా వెలగబెట్టారంటూ అంతా నిట్టూర్పు వదలడం శోచనీయం.

అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కాకినాడ నగరంలో దాదాపు 100 ఎకరాలకు పైబడి విస్తీర్ణంలో 1946లో జేఎన్‌టీయూ–కాకినాడ ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటైంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిన తరువాత 1972లో హైదరాబాద్‌లో జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూ) ఏర్పడింది. దీనికి హైదరాబాద్‌, అనంతపురం కాకినాడల్లోని ఇంజినీరింగ్‌ కళాశాలలు అనుబంధంగా ఉండేవి. వాణిజ్య, వ్యాపార పరంగా అభివృద్ధి చెందిన కాకినాడలో విద్యా రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి అప్పట్లో సంకల్పించారు. ఈ మేరకు 2008 ఆగస్టు 20న కాకినాడ ఇంజినీరింగ్‌ కళాశాలలోనే జేఎన్‌టీయూ–కాకినాడ ఏర్పాటు చేశారు. ఇది జరిగి ఇప్పటికి 18 ఏళ్లు గడిచింది. ఇప్పటి వరకూ ఏటా వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవాలు నిర్వహిస్తూ వచ్చారు. ఎందుకో ఏమిటో కానీ ఈ ఏడాది ఈ ఉత్సవం గురించి కనీసం పట్టించుకోకపోవడంపై వర్సిటీ ప్రొఫెసర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీ ప్రొఫెసర్ల వాట్సాప్‌ గ్రూపుల్లో తమ ఆవేదన వ్యక్తం చేస్తూ చేసుకున్న చాటింగ్‌లను బట్టి వారు ఏవిధంగా ఆవేదన చెందుతున్నారో అర్థమవుతోందని పలువురు అంటున్నారు. కనీసం వర్సిటీ ప్రవేశ ద్వారంలో బ్యానర్‌ కూడా పెట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీ రూ.కోట్ల నిధులున్నా, వాటిని ప్రభుత్వానికి ఇవ్వడానికి చూపించిన ఆసక్తి వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవం చేయడంలో కనిపించలేదని మండిపడుతున్నారు.

విస్తరించిన పరిధి

పాత ఉమ్మడి తూర్పు, పశ్చిమ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని 264 ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలతో పాటు విజయనగరం, నరసారావుపేట, కాకినాడ ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలలు జేఎన్‌టీయూకేకి అనుబంధంగా పని చేస్తున్నాయి. 2021 నుంచి ఈ వర్సిటీ పరిధిలో ఉన్న విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు విజయనగరం యూనివర్సిటీ పరిధిలోకి మారిపోయాయి. వర్సిటీ ప్రారంభంలో తొలి ఉప కులపతిగా అల్లం అప్పారావు పనిచేయగా, తరువాత తులసీరామ్‌దాస్‌, వీఎస్‌ఎస్‌ కుమార్‌, రామలింగరాజు, జీవీఆర్‌ ప్రసాదరాజు సేవలందించారు. ప్రస్తుతం వరంగల్‌ నిట్‌ ప్రొఫెసర్‌ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ ఈ వర్సిటీ ఉప కులపతిగా ఉన్నారు.

ఫ కానరాని జేఎన్‌టీయూకే

వ్యవస్థాపక దినోత్సవం

ఫ గతంలో ఎంతో వైభవంగా నిర్వహణ

ఫ ఇప్పుడు ఆ వేడుకలకు దూరం

అన్నీ ఉన్నా.. వేడుకలు సున్నా

ఆవిర్భావం అనంతరం ఈ వర్సిటీ ప్రాంగణంలో దాదాపు రూ.100 కోట్లకు పైబడి నిధులతో వివిధ భవనాలు నిర్మించారు. ఇన్నోవేషన్‌ సెంటర్‌, ఐఈటీలు, స్టూడెంట్‌ ఎమినిటీ సెంటర్‌, ఎగ్జామ్స్‌ సెల్‌, బాలురు, బాలికల వసతి గృహాల వంటి నిర్మాణాలతో పాటు వర్సిటీ ఆవరణలో రోడ్లు నిర్మించారు. అప్పటి వరకూ కళాశాలగా ఉన్న ప్రాంగణం వర్సిటీగా మారడంలో ఈ ప్రాంత రూపురేఖలు మారిపోయాయి. వర్సిటీ నాలుగు వైపులా గేట్లతో పాటు ముఖద్వారాల్లో వైఎస్సార్‌, నెహ్రూ, గాంధీజీ వంటి ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. వర్సిటీ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకూ 12 స్నాతకోత్సవాలు నిర్వహించారు. 10 లక్షల మందికి పైగా డిగ్రీ పట్టాలు, 2 వేల మందికి పైగా పీహెచ్‌డీలు ప్రదానం చేశారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న యూనివర్సిటీ వ్యవస్థాపక దినోత్సవానికి దూరమవ్వడం విమర్శలకు తావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement