తొండంగి: జిల్లాలో 30,502 మంది రైతులు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనలో చేరారని వ్యవసాయ శాఖ జేడీ కె.రాబర్ట్‌పాల్ అన్నారు. గురువారం స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలోని తుని సబ్ డివిజన్ పరిధిలో అధికారులు, గ్రామ సచివాలయాల అగ్రికల్చర్ అసిస్టెంట్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్‌నినో కారణంగా దేశ వ్యాప్తంగా కూడా వర్షాలు పూర్తి స్థాయిలో కురవని పరిస్థితి ఉందన్నారు. ఈ నేపథ్యంలో పంపా, పీబీసీ ఆయకట్టు పరిధిలో రైతులంతా ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించేలా అధికార యంత్రాంగం అవగాహన కల్పించాలన్నారు. పంపా, పీబీసీ పరిధిలో ఇప్పటి వరకూ 2,754 ఎకరాల వరకూ వరి నాట్లు వేసినట్టు అధికారులు వివరించారు. మిగిలిన ప్రాంతాల్లో చిరు ధాన్యాలు వంటి సాగు చేయాలన్నారు. అదేవిధంగా ఇప్పటి వరకూ సాగు చేసిన వరి పొలాలకు ఈ– క్రాఫ్ నమోదు, బీమా చెల్లింపు తదితర అంశాలపై చర్చించారు. వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్, మండల వ్యవసాయ శాఖాధికారి ఎంఎంవీఎస్ పద్మశ్రీ, ఏఈఓ మాథన సతీష్‌వర్మ పాల్గొన్నారు.


