తనువు చాలించాలని..
పిఠాపురం: స్థానిక పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబంతో సహా ఆత్మహత్యా యత్నానికి పాల్పడడం.. దానికి కారణాలు తెలుపుతూ సూసైడ్ నోట్ రాయడం అందరినీ కలచివేసింది. ఈ ఘటన పిఠాపురంలో కలకలం రేపింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. నూకరాజుకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. వారిని అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేశారు. ఆనందంగా ఉంటున్న ఆ కుటుంబంలో విధి వక్రించింది. కుమారుడు కొన్నేళ్ల క్రితమే మృతి చెందడంతో విషాదం అలుముకుంది. దాని నుంచి తేరుకుని కుమార్తెకు జగదీశ్వరరావుతో పెళ్లి చేయగా, పండంటి మనువడు కార్తికేయరెడ్డి పుట్టడంతో వారింట్లో మళ్లీ ఆనందం వెల్లివిరిసింది. కుమార్తెను అల్లుడిని మనువడిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ, కొడుకు చనిపోయిన లోటును మర్చిపోయి ఆనందంగా ఉంటున్న వారి కుటుంబంలోకి షేక్ సాధిక్‌ఖాన్ అనే వ్యక్తి వేధింపులు అల్లుడిని కూడా పొట్టన పెట్టుకున్నట్లు చెబుతున్నారు. గత జూలైలో అల్లుడు చనిపోవడం, షేక్ షాధిక్‌ఖాన్ వేధింపులు రోజురోజుకూ రెట్టింపు కావడంతో కుటుంబం అంతా ప్రతి రోజూ నరకం అనుభవించేదని బంధువులు అంటున్నారు. సమాజంలో బాధ్యతాయుతమైన పదవిలో (పంచాయతీరాజ్ ఏఈగా) ఉంటూ కంటికి రెప్పలా చూసుకునే కన్న కూతురికి ఎదురైన వేధింపుల నుంచి ఆమెను కాపాడలేని నిస్సాయస్థితిలో సమాజంలో తలదించుకుని బతకాల్సి వస్తుందన్న భయంతో తండ్రిగా నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనువడు కార్తికేయరెడ్డి బలవన్మరణానికి తెగించేలా చేసిందంటున్నారు. రాజమహేంద్రవరంలో గోదావరిలోకి దూకిన నూకరాజు, ఆయన భార్య, కుమార్తె గల్లంతు కావడం.. ఆయన మనువడికి మాత్రం ఈత రావడంతో ప్రాణాలతో బయటపడడం జరిగింది.
ఇంకా సూసైడ్ నోట్లు ఉన్నాయా!
నూకరాజుతో పాటు ఆయన కుమార్తె, భార్య సైతం తాము చనిపోతున్నట్లు దానికి కారణాలను తెలుపుతూ మరో రెండు సూసైడ్ నోట్లు రాసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అవి బయటపడలేదంటున్నారు. వారు కూడా తమ బాధను వ్యక్తం చేస్తూ లెటర్లు రాసి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టినట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు వారు రాసినట్లు చెబుతున్న సూసైడ్‌నోట్లు బయటపడలేదు. అటువంటివి ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
దిగ్భ్రాంతిలో పిఠాపురం
పిఠాపురంలో పంచాయతీ రాజ్ ఏఈగా పనిచేస్తున్న నూకరాజు కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నారన్న వార్తను పిఠాపురంలో సహచర ఉద్యోగులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు జీర్ణించుకోలేక పోతున్నారు. అందరితో కలుపుగోరుతనంగా ఉంటూ ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా తన పని తాను చేసుకుపోయే మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తిగా పేరున్న నూకరాజు హఠాత్తుగా ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం తెలియడంతో పిఠాపురంలో నేతలు అధికారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. 12 ఏళ్లుగా ఒకేచోట అదీ పిఠాపురంలో ఆయన పని చేస్తున్నారంటే ఆయన మంచితనమే ఇక్కడ ఇంతకాలం పనిచేసేలా చేసిందని సహచర ఉద్యోగులు చెబుతున్నారు.
పిఠాపురంలో
పోలీసుల విచారణ
పిఠాపురం పంచాయతీరాజ్ విభాగంలో ఏఈగా పని చేస్తున్న నూకరాజు ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ కార్యాలయంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఆయన ఆత్మహత్యకు సూసైడ్ నోట్‌లో రాసిన కారణంతో పాటు ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా, ఆయన పని చేసేటప్పుడు ఎలా ఉండేవారు, ఇతర ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అనే కోణాల్లో సహచర ఉద్యోగులను అడిగి వివరాలు సేకరించారు. పిఠాపురం సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు వివరాలు తీసుకున్నారు.
మరణ శాసనం రాసుకుని..
కాపాడాలని ప్రయత్నించినా..
నూకరాజు సూసైడ్ నోట్ తమ గ్రూప్‌లో పోస్టు చేసిన వెంటనే స్పందించి నూకరాజు కుటుంబం ఎక్కడ ఉందనే విషయాలను తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాం. సూసైడ్ నోట్ చూసిన వెంటనే కాకినాడలో ఆయన ఇంటికి వెళ్లి చూడగా, తాళాలు వేసి ఉండడంతో కంగారు వచ్చి ఆయన కోసం ఫోన్‌లో ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. చివరకు ఆయన కుటుంబంతో సహా ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించి గోదావరిలోకి దూకినట్లు తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాం. ఆయన ఒక వ్యక్తి వల్ల అవమానాలను వేధింపులను భరించలేక ఇంత దారుణమైన నిర్ణయం తీసుకున్నారని ఆయనే రాశారు. కానీ కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఆయన చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. అందుకే అవమానం భరించలేకపోయారు. అంతేగాని ఆయన తప్పుడు మనిషి కాదు. ఆయనపై ఎవరు ఎటువంటి తప్పుడు ప్రచారాలు చేయవద్దని వేడుకుంటున్నాం.
– ఎన్.కాశీవిశ్వనాథ్,
ఇంజినీరింగ్ అసిస్టెంట్, పిఠాపురం
కంటికి రెప్పలా పెంచుకున్న కన్న కూతురి జీవితం ఎలా వెళ్తుందో.. కుటుంబ పరువు ఏమవుతుందోనని కలత ఆ తండ్రిని కుంగదీసింది. ఆ కుటుంబానికి అనుకోని ఓ వ్యక్తి బెదిరింపులు అసలు ఈ జీవితం ఎందుకనే స్థాయికి తీసుకెళ్లాయి.. అవి తట్టుకోలేక తనువు చాలించాలని పంచాయతీరాజ్‌లో ఏఈగా పనిచేస్తున్న నూకరాజు తన భార్య, కుమార్తెతో పాటు మనువడిని తీసుకుని రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో దూకేయడం కలకలం రేపింది. ఈ ఘటన పిఠాపురంలో విషాదాన్ని నింపింది. ఆ హృదయవిదారక ఘటనను తట్టిచూస్తే..
ఫ పంచాయతీరాజ్ ఏఈ
కుటుంబం ఆత్మహత్యాయత్నం
ఫ సూసైడ్ నోట్‌లో వివరాలు వెల్లడి
ఫ పిఠాపురంలో విషాదఛాయలు
ఎంత కాలం నుంచి ఇబ్బంది పడుతున్నారో ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడుతూ వచ్చిన నూకరాజు చివరకు తన మరణ శాసనాన్ని తానే రాసుకుని అవమానం, భయం ముంచెత్తిన వేళ తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. చివరి క్షణాల్లో తాను రాసిన సూసైడ్ నోట్‌ను తన సహచర ఉద్యోగుల వాట్సాప్ గ్రూప్‌లో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో పోస్టు చేసినట్లు ఉద్యోగులు చెబుతున్నారు. అది చూసిన సహచర ఉద్యోగులు కంగారు పడి కాకినాడలో ఆయన ఇంటికి వెళ్లి చూడగా, ఇంటికి తాళం వేసి ఉన్నట్లు గుర్తించారు. అనంతరం ఆయన సెల్‌కు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఆయన కారు డ్రైవర్‌కు ఫోన్ చేయగా.. నూకరాజు కుటుంబ సభ్యులను తాను కారులో రాజమహేంద్రవరం తీసుకెళ్లానని అక్కడకు వెళ్లాక.. మా తమ్ముడి ఇంటికి వెళుతున్నాం.. నువ్వు కారు వదిలేసి రైలు ఎక్కి ఇంటికి వెళ్లిపోమని డ్రైవర్‌కు ఆయన చెప్పినట్లు సహచర ఉద్యోగులు వివరించారు.


