ఫ విచారణ అధికారిగా
ఐపీఎస్ అధికారి పాటిల్
ఫ ఫైల్స్‌ను అప్పగించిన
ప్రకాశ్‌నగర్ పోలీసులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరంలో డాక్టర్ ప్రియాంక మృతి ఘటన సంచలనం సృష్టించింది. ఈ కేసు దర్యాప్తునకు తూర్పుగోదావరి జిల్లా అదనపు ఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్‌ను విచారణ అధికారిగా ప్రభుత్వం నియమించింది. దీంతో డాక్టర్ ప్రియాంక కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన అంశాలపై అనేక అనుమానాలు, ప్రశ్నలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ విచారణకు ప్రాధాన్యం ఏర్పడింది. ముఖ్యంగా స్థానిక ప్రసాదిత్య మాల్ వద్ద ఘటన జరిగిన తేదీ నుంచి విషయం అధికారికంగా వెలుగులోకి వచ్చే వరకు గడిచిన సమయం ఏమిటి? ఆ మధ్యలో అసలు ఏం జరిగింది? ఈ ఘటనకు సంబంధించిన సమాచారం పోలీసులకు ఎప్పుడు చేరింది? చేరిన వెంటనే ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనే ప్రశ్నలకు స్పష్టమైన ఆధారాలను సేకరించనున్నారు. అదేవిధంగా ఘటనా స్థలంలోని సీసీ కెమెరాల ఫుటేజీ, మృతురాలి కాల్స్ డేటా, ఆమెతో చివరిగా మాట్లాడిన వ్యక్తులు, నిందితుల కదలికలు, వాహనాల ప్రయాణ వివరాలు, ఫోరెన్సిక్ ఆధారాలు, పోస్ట్‌మార్టం నివేదికతో పాటు ఇప్పటివరకు సేకరించిన ప్రతి ఆధారాన్ని విచారణ అధికారి పరిశీలించాల్సిన అవసరం ఉంది.
అసలు పరీక్ష ఇక్కడే..
ఇప్పటికే బయటకు వచ్చిన సమాచారాన్ని మాత్రమే ఽధ్రువీకరించడమా? లేకుంటే ఘటనకు ముందు నుంచి, ఘటన జరిగిన సమయం నుంచి, ఆ తర్వాత విషయం వెలుగులోకి వచ్చే వరకు జరిగిన ప్రతి పరిణామాన్ని స్వతంత్రంగా పరిశీలించడమా? అనేది కీలకం. ఈ విచారణలో ప్రతి అనుమానానికి ఆధారాలతో సమాధానం లభిస్తేనే ప్రజల్లో నెలకొన్న సందేహాలు తొలగుతాయి. ఎవరి తప్పు ఉన్నా బయటపెట్టడం, దర్యాప్తులో ఎక్కడైనా లోపం జరిగి ఉంటే దానిని కూడా స్పష్టంగా వెల్లడించడం ఈ విచారణకు అసలు సవాల్.


