పెద్దాపురం: కట్టమూరులో పచ్చకామెర్ల బాధితులను హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు పరామర్శించారు. సోమవారం ఆ గ్రామ ఎస్సీ పేటలో బాధిత చిన్నారులను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వ్యాధి ప్రబలడానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయా బాధిత కుటుంబ సభ్యులు, కాలనీ మహిళలు మాట్లాడుతూ తమ ఎస్సీ పేటకు సక్రమంగా తాగునీరు రావడం లేదని వాపోయారు. కలుషిత నీటి సరఫరాపై అధికారులకు ఫిర్యాదు చేసినా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు. గ్రామంలో చాలామంది చిన్నారులు, వృద్ధులు కామెర్లు, టైఫాయిడ్‌తో బాధపడుతున్నారని వాపోయారు. తూతూమంత్రంగా చర్యలు తీసుకుంటున్నారని, పూర్తి స్థాయిలో సురక్షిత నీరు రావడం లేదని చెప్పారు. ఈ విషయంపై దవులూరి దొరబాబు మాట్లాడుతూ గ్రామంలో సమస్యలను జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళతామని భరోసా ఇచ్చారు. కట్టమూరు గ్రామ ప్రజలకు వైఎస్సార్ సీపీ ఉంటుందని, తాను ప్రజల పక్షాన ఉండి పోరాటాలు సాగిస్తామని అన్నారు. గ్రామానికి రక్షిత నీరు సరఫరా చేసి, పూర్తి స్థాయిలో పారిశుధ్యం మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. ఎంపీటీసీ సభ్యులు నల్లల గోవిందు సూర్యకుమారి, ఉప్పటి ప్రసాద్, గ్రామ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు రంగనాథ్ శ్రీనివాసరావు, పార్టీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలు ఏలేటి అనంతలక్ష్మి, మండల సోషల్ మీడియా విభాగం అధ్యక్షులు జ్వోతుల నాగు, జెస్సీ, భూషణం, జీను వెంకటరమణ, జి.రాజు, జి.ఆనంద పాల్గొన్నారు.
హౌసింగ్ కార్పొరేషన్
మాజీ చైర్మన్ దవులూరి దొరబాబు


