బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): రూ.30 కోట్లు మింగేసినా పట్టించుకోరా.. టీడీపీ నాయకుడు కావడంతోనే వెనుకంజ వేస్తున్నారా అంటూ వినాయక్ ఈస్ట్ చిట్స్ ఫండ్ బాధితులు మండిపడ్డారు. ఎంతో కష్టపడి అవసరాలకు ఉపయోగపడతాయని రూపాయి, రూపాయి పోగుచేసుకొని చీటి కడితే.. తమ డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం కాకినాడలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌కు బాధితుల సంఘ నాయకులు రాఘవులు, సక్కుబాయ్, అనసూరి రాజకుమారి వినతి పత్రం సమర్పించారు. వందలాది మంది వద్ద చీటీలు కట్టించుకుని రూ.30 కోట్లకు టోకరా వేసిన చిట్స్ యాజమాన్యం, డైరెక్టర్లందరినీ తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధితుల బాధలు పట్టించుకోకుండా చిట్స్ ఫండ్ యాజమాన్యానికి సహకరిస్తున్న అధికారులను తక్షణం సస్పెండ్ చేయాలని, ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని కోరారు. చిట్స్ ఫండ్ చైర్మన్ శేతుమాధవరావు టీడీపీ నాయకుడు కావడం వల్లే పోలీసులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు అతనిపై చర్యలు తీసుకోవడం లేదని బాధితులు వాపోయారు. బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసుల సహకారంతో అతను ప్రస్తుతం బెయిల్‌పై తిరుగుతున్నట్లు చెప్పారు. చిట్స్ ఫండ్ డైరెక్టర్లపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, తాము ఇప్పటికే పలుమార్లు పోలీసులు, వివిధ శాఖల అధికారులు చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో బాధితులు సలాది కుమారి, త్రినాథ్, ఎర్రంశెట్టి సత్యనారాయణమూర్తి, కోటిపల్లి విజయశ్రీ, కోటిపల్లి వీరరాఘవులు, కృష్ణవేణి, సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఫ టీడీపీ నాయకుడు
కావడంతోనే వెనుకంజా!
ఫ వినాయక్ ఈస్ట్ చిట్స్
బాధితుల మండిపాటు


