పారదర్శకంగా రీసర్వే చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా రీసర్వే చేపట్టాలి

Aug 18 2026 12:15 AM | Updated on Aug 18 2026 12:15 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): రీసర్వే నాలుగో దశకు సంబంధించిన డేటా ఎంట్రీని ఈ నెల 20వ తేదీలోగా పారదర్శకంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ రెవెన్యూ, సర్వే అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌ నుంచి సోమవారం తహసీల్దార్లు, రెవెన్యూ, సర్వే అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రీసర్వే ప్రక్రియను అత్యంత కచ్చితత్వంతో, పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. భూములపై వాస్తవ అనుభవదారులకు హక్కులు కల్పించే విధంగా రీసర్వే ప్రక్రియను నిష్పక్షపాతంగా చేపట్టాలని స్పష్టం చేశారు. రీ సర్వేకు సంబంధించి సర్వే నంబర్లు, ఆధార్‌ నంబర్ల నమోదులో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.సెప్టెంబర్‌, అక్టోబర్‌, నవంబర్‌, డిసెంబర్‌, జనవరి నెలలకు సంబంధించి పట్టాదారు పాస్‌ పుస్తకాల పంపిణీకి ఇప్పటి నుంచే ఈకేవైసీ, బుక్‌ ఫర్‌ ప్రింటింగ్‌ ప్రక్రియలపై దృష్టి సారించాలని ఆదేశించారు. అనంతరం కౌడా పరిధిలోని అభివృద్ధి పనులపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కౌడా పరిధిలో చేపట్టాల్సిన అన్ని సివిల్‌ పనులను ఈ నెల 24 నాటికి ప్రారంభించాలని అన్నారు. సమావేశంలో జేసీ అపూర్వ భరత్‌, ట్రైనీ కలెక్టర్‌ ప్రియా పాల్గొన్నారు.

అనుమతి మేరకే

పొగాకు సాగు చేయాలి

దేవరపల్లి: పొగాకు బోర్డు అనుమతించిన మేరకే పంట సాగు చేయాలని బోర్డు కార్యదర్శి డి.వేణుగోపాల్‌ విజ్ఞప్తి చేశారు. సోమవారం గోపాలపురం పొగాకు వేలం కేంద్రాన్ని సోమవారం ఆయన సందర్శించారు. అనంతరం వేలం కేంద్రం వద్ద రైతులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పొగాకు సాగులో కొత్త నిబంధనలను వివరించారు. 2025–26 సీజన్‌లో అధిక ఉత్పత్తి కారణంగా మార్కెట్‌లో ధరలు తగ్గి రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. 2026–27 సీజన్‌లో పొగాకు (ఎఫ్‌సీవీ) సాగు విస్తీర్ణం, ఉత్పత్తిని పరిమితం చేయాలని బోర్డు నిర్ణయించిందన్నారు. రాష్ట్రంలో పొగాకు ఉత్పత్తిని 170 మిలియన్ల కిలోల నుంచి 81 మిలియన్ల కిలోలకు పరిమితం చేయాలని అధికారులు తేల్చారన్నారు. అధిక ఉత్పత్తి వల్ల ధరలు పడిపోకుండా రైతులకు ముందస్తుగా అవగాహన కల్పించనున్నట్టు ఆయన తెలిపారు. తక్కువ నాణ్యత గల పొగాకుకు గిట్టుబాటు ధర వచ్చేలా కొనుగోళ్లు చేపట్టాలని ప్రభుత్వం సూచించిందన్నారు. గ్రామీణ, పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేలా రైతు సంక్షేమ పథకంలో ప్రభుత్వ రుసుం రూ. 500 నుంచి రూ.1,325కు పెంచినట్టు వేణుగోపాల్‌ తెలిపారు. మరణించిన రైతు కుటుంబానికి ఆర్థిక సాయాన్ని పెంచారన్నారు. విద్యార్థుల ఉన్నత విద్యకు ప్రోత్సాహం అందించడమే లక్ష్యంగా పథకాన్ని అమలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. బోర్డు రీజినల్‌ మేనేజర్‌ జె.సురేంద్రకుమార్‌, వేలం నిర్వహణాధికారి బి.శ్రీహరి, ఐటీసీ మేనేజర్‌ కొట్రేషి, పీఎస్‌ఎస్‌హెచ్‌ కంపెనీ ప్రతినిధి రఘురామరాజు, జీపీఐ కంపెనీ ప్రతినిధి జనార్దన్‌రెడ్డి, బోర్డు మాజీ వైస్‌ చైర్మన్‌ గద్దే శేషగిరిరావు పాల్గొన్నారు.

ప్రభుత్వానికి ఏటీఎంలా

పోలవరం ప్రాజెక్టు

రాజమహేంద్రవరం సిటీ: రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును డబ్బులు సంపాదించే ఏటీఎం మెషీన్‌లా వాడుకుంటోందని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ అన్నారు. దీనిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి కేంద్రం నిర్మించేలా ఒప్పందం జరిగినా, రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ బాధ్యత తీసుకుని, ఇంకా పూర్తి చేయకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రాజమహేంద్రవరంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి మొదట రూ.6 వేల కోట్లుగా ప్రకటించగా, ప్రస్తుతం రూ.66 వేల కోట్లు దాటిందన్నారు. ముంపు ప్రాంతాల్లో ఇప్పటికీ పూర్తి స్థాయిలో భూసేకరణ జరగలేదన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో 4 గ్రామాలు, ఒడిశాలో 8 గ్రామాలు ముంపునకు గురయ్యే పరిస్థితి ఉండటంతో రెండు ప్రభుత్వాల అనుమతులు అవసరం ఉందన్నారు. నిర్వాసితుల కోసం నిర్మించిన కొన్ని కాలనీలు శిథిలావస్థకు చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం నిర్మాణంలో లోపభూయిష్టమైన విధానాలు ఉన్నాయని, పోలవరం భూములు 5వ షెడ్యూల్‌, ఏపీ ఎల్‌పీఆర్‌ చట్ట పరిధిలో ఉన్నాయని చెప్పారు. షెడ్యూల్‌ ప్రాంతాల భూములను ప్రైవేట్‌ సంస్థలకు కేటాయించడం చట్టవిరుద్ధమన్నారు. పోలవరం హైడ్రో పవర్‌ను ప్రభుత్వ సంస్థ ఏపీ జెన్‌కోకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గిరిజన రైతుల నుంచి తీసుకున్న భూములను గ్రీన్‌కో, మెగా సంస్థలకు పవర్‌ ఉత్పత్తి కోసం కేటాయించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ఈ వ్యవహారాన్ని పరిశీలించేందుకు జాతీయ గిరిజన కమిషన్‌, సంబంధిత గిరిజన సంక్షేమ సంస్థలు రంగంలోకి దిగాయన్నారు. ఈ భూముల కేటాయింపు విషయంలో చివరి వరకు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. ప్రైవేట్‌ సంస్థలకు కేటాయించిన భూములను ప్రభుత్వమే వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో కోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement