● ఎగిరిన త్రివర్ణ పతాకం
● కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో
స్వాతంత్య్ర దినోత్సవం
● ఆకట్టుకున్న ప్రదర్శనలు, శకటాలు
● 242 మందికి ఉత్తమ సేవా పురస్కారాలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ, కాకినాడ క్రైం: దేశానికి స్వేచ్ఛా వాయువులు తీసుకొచ్చిన త్యాగధనుల స్ఫూర్తి గా.. త్రివర్ణ పతాకం నింగిన ఎగసింది.. స్వాతంత్య్ర దినోత్సవ వేళ అందరిలో దేశభక్తిని నింపింది.. వందే మాతర గీతం అందరి నోటా ప్రతిధ్వనించింది.. దీనికి కాకినాడ వేదికై ంది. గురువారం స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జిల్లా స్థాయి 80వ స్వాతంత్య్ర దిన వేడుకలు నిర్వహించారు. దీనికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీసమేతంగా హాజరయ్యారు. కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆధ్వర్యంలో ఎస్పీ బిందుమాధవ్ భద్రతా పర్యవేక్షణలో జాతీయ జెండాను పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సాంస్కృతిక ప్రదర్శనలు, పోలీస్ జాగిలాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
కట్టిపడేసిన ప్రదర్శనలు
సర్పవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు గగన వీధిలో రెపరెపలాడే జెండా, కాకినాడ గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ విద్యార్థులు ఇదే మన భారతం ఇలలో పూల రథం, కోటనందూరు మండలం అల్లిపూడి కేజీవీబీ పాఠశాల విద్యార్థులు వందేమాతం, యర్రవరం పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు భారతమాతకి జయహో, సుభానికేతన్, శ్రీప్రకాష్ ఎన్‌సీసీ యూనిట్ విద్యార్థులు సుజలం సుఫలాం మలయజ శీతలం పాటలకు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇందులో అల్లిపూడి కేజీబీవీ విద్యార్థులకు ప్రథమ, సర్పవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ద్వితీయ, సుభానికేతన్, శ్రీప్రకాష్ ఎన్‌సీసీ యూనిట్‌కు తృతీయ స్థానాలు దక్కాయి.
ప్రాజెక్ట్ హనుమాన్ ప్రథమం
వివిధ ప్రభుత్వ శాఖలు రూపొందించిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. అన్నవరం సత్యనారాయణ స్వామి, వందేభారత్ ట్రైన్ పైలెట్, వీబీజీ రామ్‌జీ పల్లె పండగ, గ్రేట్ గ్రీన్ వాల్, వ్యవసాయ, ఉద్యానవన, రైతన్న మీకోసం, ప్రాజెక్టు హనుమాన్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అడవి తల్లి బాట, జిల్లా ప్రజా పరిషత్– స్వచ్ఛ రథం, జిల్లా విద్యాశాఖ– పీఎంశ్రీ పాఠశాల శకటాలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. ఇందులో అటవీశాఖ ప్రదర్శించిన ప్రాజెక్ట్ హనుమాన్‌కు ప్రథమ స్థానం దక్కింది. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ అడవితల్లి బాటకు ద్వితీయ, జిల్లా విద్యా శాఖ పీఎంశ్రీ పాఠశాలకు తృతీయ స్థానాలు దక్కాయి. ఆయా శాఖల ఉన్నతాధికారులకు జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ జ్ఞాపికలు అందజేశారు.
మెరిసిన స్టాల్స్
సృజనాత్మకత ఉట్టిపడేలా వివిధ స్టాల్స్ ఏర్పాటయ్యాఇయి. గ్రామీణ అభివృద్ధి సంస్థ, ఏపీఎంఐపీ, మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయతీ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, మత్స్య శాఖ స్టాళ్ల ద్వారా కార్యకలాపాలను ప్రతిబింబించారు. స్టాళ్ల కేటగిరిలో పోలీస్ శాఖకు ప్రథమ, మహిళా శిశు సంక్షేమ శాఖకు ద్వితీయ, జిల్లా మత్స్య శాఖకు తృతీయ స్థానాలు దక్కాయి.
ఆకట్టుకున్న కవాతు
పోలీస్ గౌరవ వందన స్వీకరణతో మొదలైన వేడుక కవాతుతో ముగిసింది. పోలీస్, ఎన్‌సీసీ దళాలు సంయుక్తంగా నిర్వహించిన సంప్రదాయ కవాతు అలరించింది. ఉత్తమ కవాతు కేటగిరీలో 3 ఆంధ్ర ఎన్‌సీసీ బాలికల బెటాలియన్‌కు ప్రథమ స్థానం, 18 ఆంధ్ర ఎన్‌సీసీ బాలురకు ద్వితీయ స్థానం, సమ్మన్ గార్డ్ డీఏఆర్ కంటిన్జెంట్‌కు తృతీయ స్థానాలు దక్కాయి.
242 మందికి పురస్కారాలు
జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న 242 మంది ఉద్యోగులకు ఉత్తమ సేవా పురస్కారాలు దక్కాయి. వీరిలో అధికారులు, సిబ్బంది ఉన్నారు. 21 మంది జిల్లా స్థాయి అధికారులు ప్రశంసా పత్రాలు అందుకున్న వారిలో ఉన్నారు. వీరంతా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్నారు. వీరితో పాటు సిబ్బందికి ఇచ్చారు. ఈ వేడుకల్లో పార్లమెంట్ సభ్యుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ తలాటం నాగవెంకటసత్య, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.


