రత్నగిరి వాసా.. చిద్విలాసా | - | Sakshi
Sakshi News home page

రత్నగిరి వాసా.. చిద్విలాసా

Aug 16 2026 12:15 AM | Updated on Aug 16 2026 12:15 AM

అన్నవరం: రత్నగిరి వాసా.. చిద్విలాసా అంటూ ఆ సత్యనారాయణ స్వామివారిని భక్తులు కొలిచారు. అన్నవరంలోని శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం శనివారం భక్తులతో కిక్కిరిసింది. శ్రావణమాసం సందర్భంగా తిరిగి వివాహాలు ప్రారంభం కావడంతో వధూవరులు, వివాహ బృందాలతో రద్దీగా మారింది. సుమారు 50 వేల మంది భక్తులు రాగా, రూ.200 టిక్కెట్‌తో ప్రత్యేక దర్శనానికి గంట సమయం, సాధారణ దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు. రావిచెట్టు వద్ద జ్యోతులను వెలిగించి పూజలు చేశారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. నిత్యాన్నదాన పథకంలో ఐదు వేల మంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు.

శృంగారవల్లభ స్వామి

ఆలయంలో ప్రత్యేక పూజలు

సామర్లకోట: పెద్దాపురం మండల పరిధిలోని తిరుపతి గ్రామంలో కొలువైన శ్రీదేవి, భూదేవి సమేత శృంగారవల్లభ స్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. స్వామివారికి అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు 15 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. స్వామివారిని, ఆలయాన్ని పూలమాలలతో అలంకరించారు. ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా రూ.1,84,440, అన్నదాన విరాళాలుగా రూ.45,663, కేశ ఖండన ద్వారా రూ.6,400, తులాభారాలతో రూ.550, లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ.20,400 కలిపి మొత్తం రూ.2.57,453 ఆదాయం వచ్చిందని ఈఓ వివరించారు. ఆలయంలో నాలుగు వేల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారని ఈఓ తెలిపారు. మాజీ సర్పంచ్‌ మొయిలి కృష్ణమూర్తి, ట్రస్టు బోర్డు చైర్మన్‌ మొయిలి సంధ్య, దేవస్థాన సిబ్బంది, గ్రామ పెద్దలు భక్తులకు సేవలందించారు.

జూనియర్‌ డాక్టర్ల సమస్యలు

పరిష్కరించండి

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జూనియర్‌ డాక్టర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా డిమాండ్‌ చేశారు. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో మూడు రోజులుగా జూనియర్‌ డాక్టర్లు చేస్తున్న సమ్మెకు శనివారం ఆయన సంఘీభావం ప్రకటించారు. సమ్మె శిబిరం వద్దకు వెళ్లి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూనియర్‌ వైద్యులకు ప్రతి రెండేళ్లకు స్టైఫండ్‌ పెంచాలని, ఈ ఏడాది 30 శాతం పెంచాల్సి ఉన్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు. జూనియర్‌ వైద్యులు పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదన్నారు. అలాగే వైద్యుల ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు కొనసాగించాలన్నారు. జూనియర్‌ వైద్యులు సమ్మెలో ఉన్నా, అత్యవసర సేవలకు ఎటువంటి ఆటంకం లేకుండా విధులు నిర్వర్తిస్తున్నారని, దీనిని తాను అభినందిస్తున్నామన్నారు. ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో వారితో కలిసి పోరాటం చేస్తామన్నారు. వేలాది మంది రోగులకు నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న జూనియర్‌ డాక్టర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.కిరణ్‌ కుమార్‌ ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తున్న జూనియర్‌ డాక్టర్ల శ్రమకు తగిన విధంగా స్టైఫండ్‌ను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం తక్షణమే చర్చలు జరిపి సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించాలన్నారు. ఈ పోరాటానికి పీడీఎస్‌యూ పూర్తి మద్దతు ఉంటుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement