కరప: గ్రామంలోని మెరక వీధిలో వేణుగోపాలస్వామి ఆలయానికి వెళ్లే రోడ్డును ఆధునీకరించి, సీసీ రోడ్డుగా నిర్మించాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. దీంతో స్థానికులందరూ మంగళవారం వినూత్న రీతిలో ఈ రోడ్డుపై వరినాట్లు వేసి నిరసన తెలిపారు. ఆ దారిలో రెండు సీసీ రోడ్ల మధ్య సుమారు 30 మీటర్లను నిర్లక్ష్యంగా వదిలేశారు. ఇదే గ్రామంలో పలుచోట్ల పాత సీసీ రోడ్లపైనే మళ్లీ కొత్తగా నిర్మాణాలు చేస్తున్నారు. కానీ ఈ చిన్న ముక్కను మాత్రం వదిలేశారు. కొద్దిపాటి వర్షానికే అక్కడి నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
నేడు తలుపులమ్మకు
సహస్ర ఘటాభిషేకం
తుని రూరల్: తలుపులమ్మ ఆషాఢ మాసోత్సవాలు ముగింపు దశకు చేరుకోవడంతో బుధవారం సహస్ర ఘటాభిషేకం నిర్వహించేందుకు వేద పండితులు, ప్రధాన అర్చకులు ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా మంగళవారం పంచలోహ విగ్రహాల ప్రాంగణంలో శాస్త్రోక్తంగా విఘ్నేశ్వర పూజ నిర్వహించి, కలశాలలో సప్తనదీ జలాల ఆవాహనం చేశారు. జూలై 15న లోవ దేవస్థానంలో ప్రారంభమైన అమ్మవారి ఆషాఢ మాసోత్సవాలు అమా వాస్య, బుధవారం సహస్ర ఘటాభిషేకంతో ముగుస్తాయని డిప్యూటీ కమిషనర్ పి.విశ్వనాథరాజు, చైర్మన్ పెంటకోట భాస్కర సత్యనారాయణ తెలిపారు.
స్వాతంత్య్ర వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): స్వాతంత్య్ర సమరయోధుల పోరాటం, వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రజల్లో స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించేలా జిల్లా అంతటా ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలని అధికారులను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. ఆ ఏర్పాట్లతో పాటు హర్ ఘర్ తిరంగా కార్యక్రమ నిర్వహణపై అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులతో కలెక్టరేట్‌లో మంగళవారం జేసీ అపూర్వ భరత్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు ప్రణాళిక ప్రకారం పనిచేసి, నిర్ణీత సమయానికే ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.
కలుషిత పదార్థాల తొలగింపునకు చర్యలు
తొండంగి మండలం చిన్నయపాలెం వద్ద పోలవరం ఎడమ కాలువలో గుర్తుతెలియని వ్యక్తులు వేసిన కలుషిత పదార్థాలను తొలగించేందుకు లైమ్ (సున్నం)ను ఉపయోగించాలని జలవనరులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆయన కలెక్టరేట్ నుంచి వారితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆగస్టు 14 నుంచి పోలవరం ఎడమ కాలువ ద్వారా సాగు, తాగు నీటిని విడుదల చేయాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల ఆ తేదీని మరో 10 రోజులు పొడిగించడం జరిగిందన్నారు. ఈ లోపు కాలువలోని కలుషిత నీటిని శుద్ధి చేసేందుకు లైమ్ రసాయనాన్ని పిచికారీ చేయాలని ఆదేశించారు. పిచికారీ చేసిన రెండు రోజుల అనంతరం నీటి నాణ్యతను పరీక్షించి, నీరు శుద్ధి అయిందో లేదో పరిశీలించాలనిసూచించారు. శుద్ధి కాని పక్షంలో ఆ మురుగు నీటిని మోటార్ల ద్వారా పంపింగ్ చేసికాలువను సంపూర్ణంగా శుద్ధి చేయాలని స్పష్టం చేశారు.


