మామ అఽధికారం.. మేనల్లుడి పెత్తనం! | - | Sakshi
Sakshi News home page

మామ అఽధికారం.. మేనల్లుడి పెత్తనం!

Aug 11 2026 12:18 AM | Updated on Aug 11 2026 12:18 AM

కాకినాడ రూరల్‌: మామ అధికారాన్ని అడ్డం పెట్టుకుని మేనల్లుడు పెత్తనం సాగించాలని చూస్తున్నాడు. ఇతడి చర్యలతో ప్రజలు విస్తుపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. కాకినాడ, పరిసర ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతుండడంతో ఖాళీ స్థలాలకు అమాంతం విలువ పెరిగిపోయింది. ఇదే అదనుగా కొందరు తప్పుడు డాక్యుమెంట్లు పుట్టించి స్థల యజమానులకు చుక్కలు చూపిస్తున్నారు. అధికార అండతో వ్యవస్థఽలను తమ గుప్పెట్లో పెట్టుకుని బాధితులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కాకినాడ నగరంలో విలీన ప్రతిపాదిత వాకలపూడిలో ప్రస్తుతం నెలకొన్న స్థల వివాదం మత్స్యకారుల్లో ఆగ్రహానికి కారణమయింది. గ్రామంలో కోరమాండల్‌ కమ్యూనిటీ హాలు ఎదురుగా ఉన్న స్థలంలో ఆరు ప్లాట్లల్లో రెండు ప్లాట్లపై వివాదం తలెత్తింది. ఆరు సైట్లకు సంబంధించి గ్రామానికి చెందిన మత్స్యకార సహకార సంఘం మాజీ అధ్యక్షుడు, జనసేన నాయకుడు చింతకాయల శ్రీను ఆయన భార్య రాణి, కుటుంబ సభ్యులు ఎరిపల్లి జయమణి, కోనాడ బేబి పేరిట ఉండడంతో వారి ఆధీనంలో స్థలాలు ఉన్నాయి. వీటిలో రెండు సైట్లు తమ కుటుంబ సభ్యులకు చెందినవిగా రెడ్డి నాయుడు అనే వ్యక్తి కొందరు వ్యక్తులను తీసుకువచ్చి ఇటీవల గోడలు పెట్టించే ప్రయత్నించడం వివాదానికి దారి తీసింది. తమ స్థలంలో గోడలు పెట్టడమేంటని శ్రీను, ఆయన కుటుబ సభ్యులు నిలదీయగా తమ కుటుంబ సభ్యుల పేరిట డాక్యుమెంట్లు ఉన్నాయని రెడ్డి నాయుడు గోడలు పెట్టే కార్యక్రమాన్ని కొనసాగించే ప్రయత్నం చేశారు. మరుసటి రోజు సర్పవరం పోలీసులు కలగజేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.

ఎమ్మెల్యే మేనల్లుడి అండతోనే..

జనసేన నాయకుడు, బాధితుడు చింతకాయల శ్రీను మాట్లాడుతూ పార్టీ కోసం కష్టించి పనిచేశామని, ఈరోజు తమకే దిక్కు లేకుండా పోయిందన్నారు. జనసేన నాయకులే తమ స్థలాలపై గుండాలతో గోడలు పెట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కోర్టులో వివాదం కొనసాగుతుండగా ఎమ్మెల్యే మేనల్లుడు తూము కృష్ణచైతన్య (బన్ను) తమపై అధికార బలం ఉపయోగించి పోలీసులను లాఠీలతో బెదిరింపు చర్యలకు దింపారని, గుండాలను తీసుకువచ్చి గోడలు పెట్టించే ప్రయత్నం చేశారన్నారు. దీనిపై సీసీ ఫుటేజీలను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. తాము ఓట్లు వేస్తేనే గెలిచామా అని తమ కులాన్ని ఎమ్మెల్యే మేనల్లుడు అవమాన పరిచారని తెలిసిందన్నారు. స్థల వివాదంపై ఎమ్మెల్యేను కలిసే ప్రయత్నం చేసినా ఆయన స్పందించలేదన్నారు. తమపై పోలీసులతో లాఠీచార్జి చేయించారని ఆరోపించారు. పవన్‌కల్యాణ్‌ కలగజేసుకుని న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. బాధిత స్థల యజమాని కోనాడ బేబి మాట్లాడుతూ తనకు చెందిన స్థలం కబ్జా చేసేందుకు ఎమ్మెల్యే మేనల్లుడి అండతో ప్రయత్నం చేశారని ఆరోపించారు.

వాడబలిజ సంఘం ఆగ్రహం

వాడోళ్లు ఏమి చేస్తారులే అని తమ కులాన్ని ఎమ్మెల్యే మేనల్లుడు బన్ను అవమానించినట్టు తమ దృష్టికి వచ్చిందని, వాడోల్ల ఓట్లు కావాలా అని వాడబలిజ సంఘ నాయకులు గంపల చిన్నబ్బాయి అనే శివరావు, శీకోటి సింహాద్రి, గొల్లపల్లి పెద్ద అప్పారావు, పిరాధి అప్పారావు, తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సంఘాన్ని అవమాన పరిచారని ఓడబలిజ సంఘానికి చెందిన మత్స్యకారులు సోమవారం వాకలపూడిలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. తమ కులానికి చెందిన చింతకాయల శ్రీను జనసేన కోసం ఎంతో కష్టపడితే ఇప్పుడు ఆయన స్థలాన్నే కబ్జా చేయాలని చూస్తున్నారని దీనిపై జనసేన పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకువెళతామన్నారు. ఎమ్మెల్యే మేనల్లుడు తమను అవమానిస్తే సహించేది లేదన్నారు. ఇదే తీరు కొనసాగిస్తే మత్స్యకారులంతా సంఘటితమవుతామన్నారు.

తమ బంధువులకూ రెండు సైట్లు

ఇదిలా ఉండగా స్థల వివాదానికి సంబంధించి మరో వర్గానికి చెందిన రెడ్డి నాయుడు మీడియాతో మాట్లాడుతూ తమ బంధువుల పేరిట రెండు సైట్లు ఉండడంతో వాటికి గోడలు పెట్టే ప్రయత్నం చేశామని తాము ఎవరి సహాయం తీసుకోలేదని చెప్పారు.

సివిల్‌ వివాదాల్లో తలదూర్చడంతో

విమర్శల వెల్లువ

వాకలపూడిలో తిరగబడిన మత్స్యకారులు

తమ కులాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఎమ్మెల్యే మేనల్లుడిపై ఆగ్రహం

జనసేన పార్టీకి పనిచేసిన తనకే దిక్కు లేదని మత్స్య సహకార సంఘ

మాజీ అధ్యక్షుడి ఆవేదన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement