బోట్‌క్లబ్ (కాకినాడసిటీ): కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో సోమవారం తలపెట్టిన జైల్ భరో విజయవంతమైందని కేంద్ర కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. స్థానిక మెయిన్‌రోడ్డు హెడ్ పోస్టాఫీస్ వద్ద రాస్తారోకో అనంతరం పోస్ట్ ఆఫీస్ ముట్టడి నిర్వహించగా పోలీసులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారని అరెస్టు చేసి పోర్టు, త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లకు ఆందోళనకారులను తరలించి అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షురాలు జి.బేబీరాణి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ ఏ రంగంలో పనిచేసే కార్మికుడికై నా కనీస వేతనం నేటి ధరలకు అనుగుణంగా రూ.31 వేలు చెల్లించాలని, తక్షణం 12వ పీఆర్సీ ప్రకటించి, బకాయిపడ్డ 6 డీఏలను చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధరను చట్టబద్ధం చేయాలని, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.25 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. వ్యవసాయాన్ని దివాళా తీయించే అమెరికాతో చేసుకునే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని, కనీస పింఛన్ రూ.9 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. దేశానికి ఈ కార్పొరేట్ విధానాల నుంచి విముక్తి కోసం విద్యార్థులు, కార్మికులు, రైతులు ఐక్యంగా మరో స్వాతంత్ర పోరాటానికి సిద్ధపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌కుమార్, జిల్లా కోశాధికారి మలకా రమణ, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెంకటలక్ష్మి, చంద్రమళ్ల పద్మ పాల్గొన్నారు.


