● డ్రైవర్, క్లీనర్‌కు గాయాలు
జగ్గంపేట: రాజమహేంద్రవరం వైపు నుంచి కోల్‌కతాకు టమాటాల లోడుతో వెళుతున్న లారీ మండలంలోని రామవరం పెట్రోల్ బంక్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో టమాటాలన్నీ రోడ్డు పక్కన పడిపోయాయి. దీంతో దారి వెంట వెళుతున్న ప్రజలు చేతికందిన టమాటాలను తీసుకుపోయారు. లారీ, డ్రైవర్ క్లీనర్‌కు గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసు రంగప్రవేశం చేసి టమాటాలు ఎవరూ తీసుకుపోకుండా చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
వైద్య విద్యార్థిని ప్రియాంకకు పోస్టుమార్టం పూర్తి
కంబాలచెరువు: రాజమహేంద్రవరం ప్రసాదిత్యమాల్ వద్ద కారుతో ఢీకొట్టిన సంఘటనలో మృతి చెందిన వైద్య విద్యార్థిని కనికే ప్రియాంకకు సోమవారం రాజమహేంద్రవరం డీఎస్పీ సుభాష్ బృందం పోస్టుమార్టం నిర్వహించారు. వైద్య విద్యార్థిని ప్రియాంక కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఆమెకు పోస్టుమార్టం నిర్వహించేందుకు క్రైం డీఎస్పీ సుభాష్, ప్రకాశ్‌నగర్ సీఐ బాజీలాల్, ఎస్సై సతీష్, ఇద్దరు కానిస్టేబుళ్ల బృందం ఆదివారం రాత్రి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. మర్నాడు పోస్టుమార్టం పక్రియ పూర్తి చేసి ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం ప్రియాంక మృతదేహాన్ని భారీ ఊరేగింపుతో స్వగ్రామమైన గద్వాల్ జిల్లా అయిజ మండలంలోని ఎక్లాస్‌పురానికి తీసుకువచ్చి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు.
కాకినాడ గేట్ వే పోర్ట్ వద్ద 500 కోట్ల భారీ ప్రాజెక్టు
తొండంగి: కాకినాడ గేట్‌వే పోర్ట్‌కు చెందిన స్థలంలో రూ.500 కోట్ల పెట్టుబడితో మైరెన్ ఫ్యూయల్, లిక్విడ్ స్టోరేజ్ నిల్వ కేంద్రం ఏర్పాటుకు గ్రీన్ ఫ్యూయల్ గ్లోబల్ ట్రేడింగ్ సోమవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని కాకినాడ గేట్‌వే పోర్ట్ డైరెక్టర్, సీఈఓ రామ్‌రెడ్డి ఓజిలి తెలిపారు. ఆయన మాట్లాడుతూ 1,50,000 కిలోలీటర్ల సామర్థ్యంతో మైరెన్ ఫ్యూయల్, లిక్విడ్ స్టోరేజ్ టెర్మినల్‌ను గ్రీన్ ఫ్యూయల్ గ్లోబల్ ట్రేడింగ్ ఏర్పాటు చేయనుంది. ఈమేరకు గ్రీన్ ఫ్యూయల్ గ్లోబల్ ట్రేడింగ్ మేనేజింగ్ డైరెక్టర్ సుధాకర్, రెండు సంస్థల ప్రతినిధుల సమక్షంలో ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారన్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల స్థానికంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలతో ఒప్పందాలు జరిగిన నేపథ్యంలో ఈ ఒప్పందం వల్ల కూడా తూర్పు తీరంలో కాకినాడ గేట్ వే పోర్ట్ వ్యూహాత్మక మైరెన్ ఎనర్జీ హబ్‌గా నిలుస్తుందని వివరించారు.
17 లోగా ఉత్తమ అవార్డుకు దరఖాస్తు చేసుకోండి
కంబాలచెరువు: జిల్లా 2026 ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ప్రైవేటు యాజమాన్యం మినహా మిగిలిన అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో పనిచేస్తూ, పదేళ్ల సర్వీస్ పూర్తి చేసిన ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు సోమవారం తెలిపారు. అర్హత గల ఉపాధ్యాయులు తమ పూర్తి వివరాలతో డీఈవో.ఈజీడీటీ వెబ్‌సైట్ నందు తెలిపిన నిబంధనలు, అప్లికేషన్, చెక్ లిస్ట్‌లను పూర్తి చేసి ఈనెల 17వ తేదీలోగా సంబంధిత మండల విద్యాశాఖాధికారికి అందజేయాలన్నారు.
ఉరేసుకుని యువతి ఆత్మహత్య
కొత్తపల్లి: రొయ్యల శుద్ధి పరిశ్రమంలో పనిచేసేందుకు వచ్చిన ఒక యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సోమవారం రాత్రి పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం పాడేరు జిల్లా హుకుంపేట మండలం మద్దిపుట్టు గ్రామానికి చెందిన మాదేల కాంతమ్మ (22) కొత్త మూలపేటలో ఉన్న రొయ్యల శుద్ధి పరిశ్రమలో పనిచేసేందుకు వచ్చింది. ఆమె గత కొద్ది రోజులుగా ఆమె స్నేహితురాలితో కలిసి మూలపేటలో ఒక అద్దె ఇంట్లో ఉంటుంది. సోమవారం బాత్రూంలో ఉరివేసుకుని మృతి చెందింది. ఆమె భర్త, తల్లిదండ్రులు ఇటీవల మృతి చెందారు. ఆమె మృతదేహాన్ని పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


