శనివారం శ్రీ 8 శ్రీ ఆగస్టు శ్రీ 2026
టెంట్లు
తొలగించి..
తొండంగి: దగా డీఎస్సీపై వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో తొండంగిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షను భగ్నం చేసేందుకు టీడీపీ నేతల ప్రోద్బలంతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. రిలే నిరాహార దీక్షలను భగ్నం చేసేందుకు ప్రయత్నించారు. అయినా వెనక్కి తగ్గకుండా దీక్షను వైఎస్సార్ సీపీ, యువత కొనసాగించింది. తొండంగి గ్రామంలో ఓ ప్రైవేటు స్థలంలో రిలే నిరాహార దీక్ష కోసం ఏర్పాట్లు చేసుకోగా, స్థల యజమానిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి బెదిరించడంతో పాటు గురువారం రాత్రి తొండంగిలో ప్రతిపాదిత దీక్షా స్థలంలో ఏర్పాటు చేసుకున్న స్టేజీని, ఇతర సామగ్రిని తొలగించారు. పోలీసుల బెదిరింపులకు లొంగని వైఎస్సార్ సీపీ శ్రేణులు, యువత శుక్రవారం ఉదయం తొండంగిలోనే పార్టీ నాయకుని స్థలం వద్ద మళ్లీ టెంట్ ఏర్పాటు చేసుకొని రిలే నిరాహార దీక్ష చేపట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తొండంగి ఎస్సై జగన్మోహన్‌రావు, ఇతర పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాలతో సివిల్ డ్రస్‌లో అక్కడికి చేరుకొని రిలే దీక్షను భగ్నం చేసేందుకు యత్నించారు. అయినప్పటికీ వైఎస్సార్ సీపీ శ్రేణులు శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. అనంతరం పోలీసులు యూనిఫాం ధరించి నిరాహార దీక్ష చేపట్టిన స్థలం వద్ద టెంట్‌లను తొలగించారు. దీంతో మండుటెండైనా లెక్కచేయబోమంటూ ఎండలోనే వారంతా రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఎండ తీవ్రత పెరగడంతో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా వారందరికీ గొడుగులు ఏర్పాటు చేయించారు. దీంతో గొడుగులు చేతబట్టి సాయంత్రం వరకు రిలే నిరాహార దీక్ష కొనసాగించారు. దగా డీఎస్సీపై సీబీఐ విచారణ జరపాలని, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బేషరతుగా రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
రిలే దీక్షకు సంఘీభావం
దగా డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపి నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేయాలని తొండంగిలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో యువత చేపట్టిన రిలే నిరాహార దీక్షకు మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా సంఘీభావం తెలిపారు. ఆయన దీక్షలో కూర్చుని కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఈ సందర్భంగా రాజా విలేకరులతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుత వాతావరణంలో వైఎస్సార్ సీపీ యువత చేస్తున్న రిలే నిరాహార దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు స్పందించిన తీరును తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వ పాలనలో పోలీసులను వినియోగించుకుని రెడ్‌బుక్ పేరుతో దుష్టపాలన సాగిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మడదా హేమంత్, పార్టీ నేతలు పాల్గొన్నారు.
ఫ తొండంగిలో దీక్షను
భగ్నం చేసేందుకు కుట్ర
ఫ తగ్గేది లేదన్న
వైఎస్సార్ సీపీ శ్రేణులు, యువత
ఫ సంఘీభావం తెలిపిన
మాజీ మంత్రి దాడిశెట్టి రాజా
శాంతియుత నిరసనపై ‘కూటమి’
కుట్ర పన్నింది.. టెంట్లు తొలగించేలా, దీక్ష భగ్నం చేసేలా ఖాకీలకు పనిజెప్పింది.. ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు అత్సుత్సాహం ప్రదర్శించినా, చివరికి నిరసన గళం మొక్కవోని దీక్షతో కొనసాగింది. దీనికి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మద్దతు తోడవడంతో ఆందోళన విజయవంతం అయ్యింది.


