కాకినాడ క్రైం: రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ శిక్షణలో తర్ఫీదు పొందుతున్న అభ్యర్థులకు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు మార్గనిర్దేశం చేశారు. కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ అధ్యక్షతన వర్చువల్ విధానంలో 5,560 మంది కానిస్టేబుళ్లు చాగంటి ఉవాచకు హాజరయ్యారు. విధి నిర్వహణలో మానసిక ఒత్తిడిని జయిస్తే జయమేనని కోటేశ్వరరావు అన్నారు. పోలీసు శాఖలో నిజాయతీ, క్రమశిక్షణ, ఓర్పు ఉన్నత స్థానాలకు చేరుస్తాయన్నారు. ప్రజలు నిస్సహాయ స్థితిలో వస్తే వారికి మేమున్నామన్న భరోసా ఇవ్వడం కొండంత అండన్విడమేనని చాగంటి అన్నారు. ఫిర్యాదుదారులతో మర్యాద పూర్వకంగా నడుచుకోవాలని తెలిపారు. అనంతరం ఆయనను రాష్ట్ర పోలీస్ శాఖ తరఫున ఎస్పీ బిందుమాధవ్ ఘనంగా సత్కరించారు. ఆన్‌లైన్ విధానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ ఐజీ అంబురాజన్, ట్రైనింగ్ ఏఐజీ సత్తిబాబు, 21 పోలీస్ శిక్షణ కళాశాలలకు చెందిన ప్రిన్సిపాల్స్, జిల్లా అదనపు ఎస్పీ మహంతి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
ధరహాసం
సాక్షి, అమలాపురం: కోనసీమ కొబ్బరి మార్కెట్లో మళ్లీ జోష్ నెలకొంది. శ్రావణ మాసం, వినాయక చవితి పండగ కొనుగోళ్లతో కొబ్బరి కాయలకు డిమాండ్ వచ్చింది. దీంతో, ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అంబాజీపేట కొబ్బరి మార్కెట్‌లో వెయ్యి కొబ్బరి కాయల ధర రూ.20 వేల నుంచి రూ.22 వేల వరకూ పలుకుతోంది. గత 15 రోజుల కిందట రూ.15 వేల వరకూ ఉన్న ధర ఏకంగా రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకూ పెరిగింది. అప్పుడే దింపు తీసిన పచ్చి కొబ్బరి కాయకు మాత్రమే ఈ ధర ఉంది. ముక్కుడు కాయ (3 నెలలకు పైగా నిల్వ ఉన్న) కాయ ధర మాత్రం రూ.17 వేల నుంచి రూ.18 వేల వరకూ ఉంది. ఇప్పటికే శ్రావణ మాసం సీజన్ అమ్మకాలు పూర్తి కాగా, వచ్చే భాద్రపదం, వినాయక చవితికి దండిగా అమ్మకాలు జరగనున్నాయి. ఇప్పుడు నిల్వ ఉన్న కొబ్బరి అమ్మే అవకాశం లేనందున కొత్తగా దింపు తీసిన కాయలకు మంచి డిమాండ్ ఏర్పడింది. వచ్చేది పండగల సీజన్ కావడంతో ప్రతి ఇంటా కొబ్బరి కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఆర్డర్లు కూడా పెరిగాయి. ఈ పరిణామం కూడా కొబ్బరి ధర పెరగడానికి కారణమైంది.
మరోసారి రికార్డు స్థాయిలో పెరుగుతున్న కొబ్బరి రేటు
వెయ్యి కాయల ధర
రూ.20 వేల నుంచి రూ.22 వేలు
15 రోజుల్లో రూ.5 వేల నుంచి
రూ.7 వేల వరకూ పెరుగుదల
శ్రావణం, వినాయక చవితితో
కొనుగోలు సందడి
జోరందుకున్న ఎగుమతులు
తగ్గిన తమిళనాడు దిగుమతులు
ఇదే సమయంలో తమిళనాడు ప్రాంతంలో తయారీ కొబ్బరి (ఎండు కొబ్బరి) ధర పెరిగింది. దీంతో, అక్కడి రైతులు పెద్ద ఎత్తున ఎండు కొబ్బరి తయారు చేస్తున్నారు. దీనివల్ల ఉమ్మడి గోదావరి జిల్లాలకు తమిళనాడు నుంచి కొబ్బరి కాయల దిగుమతులు తగ్గాయి. దీనివలన కూడా ఇక్కడి కొబ్బరి ధరలకు రెక్కలొస్తున్నాయి. సాధారణంగా ధర ఉంటే దిగుబడి ఉండదు. కానీ, ప్రస్తుతం ఎకరాకు రెండు నెలల దింపు సగటున వెయ్యి కాయల వరకూ ఉంటోంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 1.80 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోంది. ధరలు పెరగడంతో ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతులు కూడా వేగం పుంజుకున్నాయి. ఇక్కడి నుంచి రోజుకు 75 నుంచి 100 లారీల కొబ్బరి ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, బిహార్, రాజస్థాన్‌లకు ఎగుమతి అవుతోంది. మార్కెట్లో నెలకొన్న ఈ జోష్ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని, ధర మరింత పెరుగుతుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.


