దిశ బిల్లు రద్దుతో చీకటి రోజులు | - | Sakshi
Sakshi News home page

దిశ బిల్లు రద్దుతో చీకటి రోజులు

Aug 8 2026 12:35 AM | Updated on Aug 8 2026 12:35 AM

పిఠాపురం రూరల్‌: దిశ బిల్లును రద్దు చేయడం అంటే, మహిళా లోకానికి చీకటి రోజులు తేవడమేనని వైఎస్సార్‌ సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత అన్నారు. దిశ బిల్లును రద్దు చేసిన కూటమి ప్రభుత్వానికి మహిళల రక్షణపై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతుందన్నారు. మహిళలపై పెరుగుతున్న దాడులు, వేధింపుల నేపథ్యంలో దిశ బిల్లు రద్దు చేయడం చాలా దారుణమన్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో మహిళలకు భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మక ‘దిశ’ బిల్లు తెచ్చారని, ప్రమాద సమయంలో ఫోన్‌ ఊపితే చాలు 15 నిమిషాలలో పోలీసులు అక్కడికి వచ్చి రక్షించేవారన్నారు. దిశ యాప్‌ను 1.5 కోట్ల మంది మహిళలు డౌన్లోడ్‌ చేసుకున్నారని తెలిపారు. అటువంటి దిశా చట్టాన్ని రద్దు చేస్తుంటే హోం మంత్రి అనిత, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ స్పందించకపోవడం దారుణమన్నారు. అదేవిధంగా రాజమహేంద్రవరానికి చెందిన వైద్యా విద్యార్థిని ప్రియాంకపై మద్యం మత్తులో కావాలని కారు ఎక్కించి మరణానికి కారణమైన ఇద్దరు దుర్మార్గులను ఉరి తీయాలని డిమాండ్‌ చేశారు.

పారదర్శకంగా ‘సర్‌’ ప్రక్రియ

కాకినాడ లీగల్‌: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (సర్‌) ప్రక్రియలో నోటీసులు అందుకున్న ప్రతి ఓటరుకు నిబంధనల ప్రకారం సముచితమైన విచారణ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల అదనపు కమిషనర్‌ ఢిల్లీ రావు అధికారులను ఆదేశించారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు జాబితాకు దూరం కాకుండా పారదర్శకంగా విచారణ చేపట్టాలని స్పష్టం చేశారు. శుక్రవారం వెలగపూడి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సర్‌ ప్రక్రియపై ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, బీఎల్‌వోలు, ఇతర సిబ్బందితో ఢిల్లీ రావు సమీక్ష నిర్వహించారు. కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో కమిషనర్‌ సత్యనారాయణ, కాకినాడ నగర ఈఆర్‌ఓ, అదనపు కమిషనర్‌ కేటీ సుధాకర్‌, ఏఈఆర్‌ఓ, డిప్యూటీ కమిషనర్‌ కె.శ్రీనివాస్‌, కాకినాడ నగర ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్‌ గోవిందరాజులు, సూపర్‌వైజర్లు, బీఎల్‌వోలు పాల్గొన్నారు.

రుణ బాధితులకు

చెక్కుల పంపిణీ

మలికిపురం: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) సఖినేటిపల్లి బ్రాంచిలో రుణ బాధితులకు వా రి బంగారానికి సంబంధించిన నగదు పంపిణీ ప్రారంభమైంది. ఈ ఎస్‌బీఐ బ్రాంచిలో సుమారు ఆరేళ్ల క్రితం జరిగి బంగారు రుణాల స్కామ్‌ను అప్పట్లో సాక్షి వెలుగులోకి తెచ్చింది. అప్పట్లో బంగారం కుదువ పెట్టి కొంత మంది ఖాతాదారులు రుణాలు పొందారు. కొంత మంది బ్యాంకు ఉద్యోగులు మాయాజాలం చేసి అదే బంగారంపై తిరిగి రుణాలు పొందారు. దీనిపై అప్పట్లో సీబీఐ విచారణ ప్రారంభం కాగా, రుణాలు పొందిన ఖాతాదారుల బంగారం బ్యాంకులో చిక్కు పడిపోయింది. రూ.కోట్లలో జరిగిన ఈ స్కామ్‌పై కొన్నాళ్లుగా సాక్షి ప్రచురించిన కథనాలకు రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌ స్పందించారు. బ్యాంకు ఉన్నతాధికారులతో మాట్లాడి, బాధితులు అప్పట్లో కుదువ పెట్టిన బంగారానికి ప్రస్తుత మార్కెట్‌ విలువ కట్టి చెక్కులు ఇప్పించే ఏర్పాటు చేశారు. మొత్తం 72 గోల్డ్‌ లోన్లలో 59 మంది అర్హులుగా గుర్తించగా, తొలి విడతలో ఐదుగురికి ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం సుమారు రూ.35 లక్షల చెక్కులను విశ్వేశ్వరాయపురంలో పంపిణీ చేశారు.

కొత్త డిజైన్లపై దృష్టి సారించాలి

అమలాపురం రూరల్‌: చేనేత రంగాన్ని మరింత లాభసాటిగా తీర్చిదిద్దేందుకు నేతన్నలు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, డిమాండ్‌కు అనుగుణంగా నూతన డిజైన్లు, నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేయాలని కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌ అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగిన జాతీయ చేనేత దినోత్సవ సభలో ఆయన మాట్లాడారు. చేనేత సహకార సంఘాలు కేవలం ప్రభుత్వ ఆర్డర్ల పైనే ఆధారపడకుండా ఓపెన్‌ మార్కెట్‌ అవకాశాలను అందిపుచ్చుకోవాలని అన్నారు. కలెక్టర్‌ను బండారులంకకు చెందిన మాజీ జెడ్పీటీసీ సభ్యుడు చింతా శంకరమూర్తి, చేనేత సంఘాల నాయకులు పర్వతం చిట్టిబాబు, ఆశపు రామలింగేశ్వరరావు, పిచ్చిక శ్యామ్‌లు రాట్నం, అయినవిల్లి సిద్ధివినాయకుని చిత్రపటం అందించి సత్కరించారు. డీఆర్‌ఓ వి.సుబ్బారావు, హ్యాండ్లూమ్స్‌ ఏడీ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement