అన్నవరం: స్థానిక వీరవెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయానికి వచ్చే భక్తుల్లో వృద్ధులు, వికలాంగుల కోసం దాతలు సమకూర్చిన బ్యాటరీ కార్లు తిరిగి రత్నగిరిపై పరుగులు తీస్తున్నాయి. ఈ బ్యాటరీ కార్లు ఆరు నెలలుగా మరమ్మతులకు గురై కొండ దిగువన గ్యారేజీలో ఉన్న వైనంపై ఈ నెల 5న ‘సాక్షి’ దినపత్రికలో ‘దర్శన భారము నీదే స్వామీ..!’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు స్పందించి వెంటనే బ్యాటరీ కార్లకు మరమ్మతులు చేయించాలని సిబ్బందిని ఆదేశించారు. వెంటనే ఈ కార్లకు మరమ్మతులు చేయించి రత్నగిరికి తీసుకువచ్చారు. శుక్రవారం పశ్చిమ రాజగోపురం నుంచి స్వామివారి నిత్యాన్నదాన పథకం, సత్రాలకు వికలాంగులు, వృద్ధులను తీసుకువచ్చి మరలా రాజగోపురం వద్దకు దింపారు.


