మిరపురాని రోజులొచ్చేలా.. | - | Sakshi
Sakshi News home page

మిరపురాని రోజులొచ్చేలా..

Aug 8 2026 12:35 AM | Updated on Aug 8 2026 12:35 AM

పొట్టి మిర్చికి పునర్జన్మ

కనుమరుగైన పంటను కాపాడే ప్రయత్నం

అరుదైన పంటగా పరిశోధనల్లో గుర్తింపు

మళ్లీ ప్రారంభించేందుకు సన్నాహాలు

ఆ రోజుల్లో పొట్టి మిర్చి ఓ వెలుగు వెలిగింది.. పుడమి పుత్రులకు లాభాలు తెచ్చిపెట్టింది.. అలాంటి అరుదైన పంట ఇప్పుడు కనుమరుగైంది. ఈ సాగుకు పుట్టినిల్లు అయిన కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలో మళ్లీ ఈ పంటను కాపాడే ప్రయత్నం మొదలైంది. ఇది అరుదైన రకంగా శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో తేలడంతో జీఐ ట్యాగ్‌ భౌగోళిక గుర్తింపు సాధించేందుకు ప్రయత్నాలు చేసి, సాగుకు సన్నాహాలు ప్రారంభించారు.

పిఠాపురం: ఎర్రగా.. గుండ్రంగా చూడడానికి చెర్రీ పండులా నోరూరించేలా పొట్టి మిర్చి ఉంటోంది. దీనిని కొరికితే చెంబుడు నీళ్లు తాగాల్సి వస్తోంది. అంత కారంగా ఉంటుంది. దీని కారం లాగానే లాభాల ఘాటు కూడా ఎక్కువే. దేశ విదేశాల్లో మిర్చి రకాల్లో పేరొందిన ఈ పొట్టి మిర్చి కేవలం కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం పుట్టినిల్లు. మిరప పంటతో పాటు, మిరపపొడి (కారం) తయారీ కూడా ఇక్కడ ఎక్కువగా జరుగుతుంది. ఈ ప్రాంతంలోని రేవడి నేలలు పంటకు అనుకూలంగా ఉంటాయి. రేవడి పంటలో పొట్టి మిర్చి ప్రధానమైనది. ఈ రకం మిర్చిని జిల్లాలో ఒక్క గొల్లప్రోలు ప్రాంతంలోనే సాగు చేసేవారు. దీనినే ‘గొల్లప్రోలు మిర్చి’గా పిలుస్తారు. గొల్లప్రోలు, చేబ్రోలు, దుర్గాడ, చెందుర్తి, తాటిపర్తి, ఎ.విజయనగరం గ్రామాల్లో సుమారు 600 నుంచి 800 ఎకరాల్లో 350 మంది రైతులు పొట్టి మిర్చి సాగు చేసేవారు. దీనిని ఎండు మిర్చికే వాడతారు. దీనిని మరాఠీ వాసులు అమితంగా ఇష్టపడతారు. దీనిని వారు ‘బోరు’మిర్చి అని పిలుస్తారు. ఉత్తరాది వారు ‘బేర్‌’మిర్చి అని అంటారు. బోరు అనగా మరాఠీలో నేరేడు పండు అని అర్థం. నేరేడు కాయ సైజులో గుండ్రంగా ఉండటంతో వారు దీనిని బోరు మిర్చి అని పిలుస్తారు. ఇక్కడ పండిన పంటలు 90 శాతం మేర మహారాష్ట్రకు అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి అవుతుండేది.

సొంతంగా విత్తనాభివృద్ధి

ఇక్కడ రైతులు సొంతంగానే విత్తనాన్ని అభివృద్ధి చేసుకోవడం విశేషం. బయట మార్కెట్లో విత్తనాన్ని కొనుగోలు చేయరు. తమకు పండిన పంటలో నాణ్యమైన కాయలను ఎంపిక చేసుకుని ఎండబెట్టి విత్తనాన్ని సిద్ధం చేసుకుంటారు. వారే స్వయంగా విత్తనాభివృద్ధి చేసి తోటి రైతులకు సైతం విక్రయించేవారు. ఎకరాకు 70 నుంచి 80 బస్తాల దిగుబడి వస్తుంది.

ఏడాదికి 250 నుంచి 330 టన్నులు

గొల్లప్రోలు మండలంలో వివిధ గ్రామాల నుంచి సంవత్సరానికి 250 నుంచి 330 టన్నుల మిర్చి ఎగుమతి జరుగుతుండేది. ఇక్కడి నుంచి ఎక్కువగా మహారాష్ట్రలోని ముంబయి, పూణేలకు తరలిస్తుంటారు. అక్కడ వీటిని కారం తయారీకి ఉపయోగిస్తుంటారు. సాధారణ మిరప కంటే మూడు రెట్లు అదనపు ధర లభిస్తుండడంతో రైతులు పొట్టి మిరప సాగుపై ఎక్కువ ఆసక్తి చూపించేవారు. వాతావరణం అనుకూలిస్తే, పెట్టుబడి పోను ఎకరాకు రూ.70 వేల నుంచి రూ.90 వేల వరకు ఆదాయం లభించేదని రైతులు చెబుతున్నారు.

పరిశోధనలు ప్రారంభం

నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ కమర్షియల్‌ అగ్రికల్చర్‌ కేంద్ర వాణిజ్య పంటల పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో అత్యంత విలువైన డిమాండ్‌ ఉన్న పొట్టి మిరపపై పరిశోధనలు చేసేందుకు అప్పట్లో చర్యలు తీసుకున్నారు. దుర్గాడ పొట్టి మిర్చికి భౌగోళిక గుర్తింపు (జీఐ) ట్యాగ్‌ సాధించేందుకు రాజమహేంద్రవరం కేంద్రంగా పనిచేస్తున్న ఐసీఏఆర్‌–నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ కమర్షియల్‌ అగ్రి కల్చర్‌ (ఐసీఏఆర్‌ ఎన్‌ఐఆర్‌సీఏ) పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ (పాడా) సంయుక్తంగా చర్యలు ప్రారంభించాయి.

శాసీ్త్రయ ఆధారాలు లభించాయి

ఐసీఏఆర్‌– నిర్కా శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనల్లో దుర్గాడ పొట్టి మిర్చి అత్యుత్తమ నాణ్యతను కలిగి ఉండటమే కాకుండా, ఈ ప్రాంతంలోనే అత్యుత్తమంగా పండుతుందని నిర్ధారించడంతో జీఐ ట్యాగ్‌కు బలమైన ఆధారాలు లభించాయి.

–రాజశేఖరరెడ్డి, సీనియర్‌ సైంటిస్ట్‌, ఐసీఏఆర్‌ ఎన్‌ఐఆర్‌సీఏ

పూర్వ వైభవం తీసుకొస్తాం

దుర్గాడ పొట్టి మిర్చి సాగును రైతులు విస్తరించేలా చర్యలు తీసుకుంటున్నాం. జీఐ గుర్తింపు లభిస్తే ఈ పంటకు ప్రత్యేక గుర్తింపు, అధిక మార్కెట్‌ విలువ లభించి రైతులకు లాభాలు పెరుగుతాయి. పొట్టి మిర్చికి పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నం విజయవంతం కావడం ద్వారా రైతులకు మేలు చేసేందుకు కృషి చేస్తున్నాం.

–డాక్టర్‌ ఎన్‌వీ శివరాం ప్రసాద్‌, పాడా ప్రాజెక్టు డైరెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement