తల్లిని హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదు | - | Sakshi
Sakshi News home page

తల్లిని హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదు

Aug 1 2026 12:16 AM | Updated on Aug 1 2026 12:16 AM

కాకినాడ లీగల్‌: తల్లిని హత్య చేసిన కేసులో కుమారుడికి జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా విధిస్తూ కాకినాడ మూడో అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి జి.ఆనంది శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం.. గత ఏడాది మార్చి 16న కాకినాడ రూరల్‌ మండలం ఎస్‌.అచ్యుతాపురానికి చెందిన షేక్‌ జహారా బీబీ తన కుమారుడు షేక్‌ షబ్బీర్‌ కమల్‌ను ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేసుకోమని మందలించింది. దీంతో వారి మధ్య జరిగిన ఘర్షణలో షబ్బీర్‌ తన తల్లిని కుర్చీతో కొట్టి, ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి మృతి చెందింది. ఈ మేరకు జహారా బీబీ భర్త ఖాదర్‌ బాషా ఫిర్యాదుతో ఇంద్రపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు విచారణలో షబ్బీర్‌పై నేరం రుజువుకావడంతో అతడికి జీవిత ఖైదు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఏపీపీ డి.నాగబాబు ప్రాసిక్యూషన్‌ నిర్వహించారు.

ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయం

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా వైద్యులు, సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలని కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ అన్నారు. కాకినాడ కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజలకు అవసరమైన వైద్యాన్ని అందించాలని స్పష్టం చేశారు. జిల్లాలో వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఎంపీడీఓలు, తహసీల్దార్లు, పురపాలక సంఘాల కమిషనర్ల సహకారంతో తక్షణమే అదుపునకు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోజుకు కనీసం అరవై మందికి పైగా ఓపీ ఉండాలన్నారు. డీఎంహెచ్‌ఓ అనిత పాల్గొన్నారు.

నవజాత శిశువు ఘటనలో

ఇద్దరిపై పోక్సో కేసు

ఐ.పోలవరం: మండలంలోని గుత్తెనదీవి గ్రామంలో చెత్తకుప్పలో నవజాత శిశువు దొరికిన ఘటనలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ శిశువుకు 17 ఏళ్ల బాలిక జన్మనిచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి చెందిన ఆ బాలికను అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మాయమాటలు చెప్పి మోసం చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ ఇద్దరిలో ఒకరు బాలుడు, మరొకరు వివాహమైన యువకుడు ఉన్నారు. బాధిత బాలిక ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులపై మైనర్‌పై తీవ్ర లైంగిక దాడి, పోక్సో చట్టం, భారతీయ న్యాయ సంహిత నిబంధనల కింద పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. వైద్య పరీక్షల నివేదికలు, డీఎన్‌ఏ పరీక్షలు తదితర శాసీ్త్రయ ఆధారాల సేకరణతో పాటు నిందితులపై తదుపరి చట్టపరమైన చర్యలకు పోలీసులు ఉపక్రమిస్తున్నారు. ప్రస్తుతం తల్లీబిడ్డలిద్దరూ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. నిందితులిద్దరిపై శుక్రవారం పోక్సో కేసు నమోదు చేసినట్లు ఐ.పోలవరం ఎస్సై రవీంద్రబాబు తెలిపారు. ఎవరి వల్ల ఆ బాలిక గర్భం దాల్చిందనే విషయంపై విచారణ కొనసాగుతోంది.

సమాచార హక్కు చట్టం పేరిట బ్లాక్‌మెయిలింగ్‌

రౌడీ షీటర్‌పై కేసు నమోదు

అమలాపురం టౌన్‌: సమాచార హక్కు (ఆర్‌టీఐ) చట్టాన్ని అడ్డు పెట్టుకుని ఓ విశ్రాంత ఉద్యోగిని బెదిరించి, అక్రమ వసూళ్లకు పాల్పడిన రౌడీషీటర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అమలాపురం పట్టణ సీఐ పి.వీరబాబు కథనం ప్రకారం.. అంబాజీపేటకు చెందిన గుత్తాల సుభాష్‌బాబు ప్రస్తుతం అమలాపురం హౌసింగ్‌ బోర్డు కాలనీలో ఉంటున్నాడు. అతడిపై అమలాపురం పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో రౌడీ షీటు ఉంది. అమలాపురం రూరల్‌ ఈదరపల్లికి చెందిన 75 ఏళ్ల వృద్ధుడు, విశ్రాంత ఉద్యోగి జంగా బాబూరావు, ఆయన కుటుంబాన్ని సుభాష్‌బాబు లక్ష్యంగా చేసుకున్నాడు. తప్పుడు ఫొటోలు చూపిస్తూ ఆర్‌టీఐ దరఖాస్తుతో ఒత్తిడి చేస్తూ అక్రమంగా డబ్బులు డిమాండ్‌ చేశాడు. డబ్బులివ్వకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని బెదిరిస్తున్నాడు. బాధితుడు బాబూరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుభాష్‌బాబుపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా ఇలాంటి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ వీరబాబు హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement